Minister Puvwada Ajay Kumar : రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మలిచిన ఘనత కేసీఆర్‌దే
ABN , First Publish Date - 2022-11-01T06:34:05+05:30 IST
‘తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడక ముందు నెర్రెలు బారిన ఈ నేల నేడు అన్నపూర్ణగా భాసిల్లుతోంది. తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే’
కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ దక్షతకు నిదర్శనం
బీజేపీ తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదు
ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలే: పువ్వాడ
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
‘తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడక ముందు నెర్రెలు బారిన ఈ నేల నేడు అన్నపూర్ణగా భాసిల్లుతోంది. తెలంగాణను అన్నపూర్ణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే’ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కేసీఆర్ అకుంఠిత దీక్ష, ప్రణాళికతోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. సోమవారం ఆయన మునుగోడు నియోజకవర్గంలోని కొరటికల్ గ్రామంలో ప్రచారం నిర్వహించారు. కరోనా లాంటి కష్టకాలంలోనూ ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని, ఇది పచ్చని తెలంగాణకు ప్రతీక అని పేర్కొన్నారు. కాళేశ్వరం లాంటి అతిపెద్ద ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసి కేసీఆర్ సాగు రంగంపై తన దక్షతను చాటుకున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాధారణకు గురైన ఎన్నో ప్రాజెక్టులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. అనేక ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయని, అన్నీ పూర్తైతే రాష్ట్రంలో దాదాపు కోటిన్నర ఎకరాలకు సాగునీరు అందుతుందని పువ్వాడ తెలిపారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికి ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందన్నారు. జాతీయ పథకాల గురించి మాట్లాడే బీజేపీ తెలంగాణకు ఒరగబెట్టిందేమీ లేదని పువ్వాడ విమర్శించారు.
రాష్ట్రంలోని ఏ ఒక్క సాగు నీటి పథకానికి కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయ హోదాను ఇవ్వలేదని అన్నారు. పసుపు బోర్డుపై బీజేపీ చేసిన వాగ్దానం అటకెక్కిందని ఎద్దేవా చేశారు. అధికారం కోసం పాకులాడే పార్టీలు ఒకవైపు, తెలంగాణను బలమైన రాష్ట్రంగా తీర్చిదిద్ది సబ్బండ వర్గాల ఆర్థిక స్థితిగతులను పెంచడానికి కృషి చేస్తున్న టీఆర్‌ఎస్ మరోవైపు మునుగోడులో తలపడుతున్నాయని, ఏ వైపు ఉంటారో ప్రజలే తేల్చుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలు ఢిల్లీని నమ్ముకుంటే, టీఆర్‌ఎస్ పార్టీ గల్లీ ప్రజలనే నమ్ముకుందని, మునుగోడులో టీఆర్‌ఎ్‌సను గెలిపించాలని కోరారు. తెలంగాణ వ్యతిరేకులకు బుద్ధి చెప్పాలన్నారు.
మునుగోడు ప్రజలు అమ్ముడుపోరు: గంగుల
మునుగోడు ప్రజలు చైతన్యవంతులని, డబ్బులకు అమ్ముడుపోరని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నించినట్లే బీజేపీ మునుగోడు ఓటర్లను కొనడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం ఖాయమన్నారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ జన్మదిన వేడుకలను సోమవారం పోర్లగడ్డతండాలో నిర్వహించారు. మంత్రి బంజార సంప్రదాయ దుస్తులు ధరించి గిరిజన మహిళలతో కలిసి కేక్ కట్ చేశారు. కేసీఆర్ పాలనను అశీర్వదించి, టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని మునుగోడు ప్రజలను కోరారు.