Bharat Jodo Yatra: టీఆర్‌ఎస్‌తో పొత్తుపై రాహుల్ క్లారిటీ
ABN , First Publish Date - 2022-10-31T15:32:04+05:30 IST
తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) పాదయాత్ర ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతోంది. పాదయాత్రలో అలసట లేకుండా పిల్లలతో నేతలతో సరదా గడుపుతూ కాంగ్రెస్ నేతలను రాహుల్ ఉత్సాహపర్చుతున్నారు.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) పాదయాత్ర ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతోంది. పాదయాత్రలో అలసట లేకుండా పిల్లలతో నేతలతో సరదా గడుపుతూ కాంగ్రెస్ నేతలను రాహుల్ ఉత్సాహపర్చుతున్నారు. విద్యార్థి, కార్మికులు, రైతులతో భేటీ నిర్వహిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్ పొత్తు పెట్టుకుందనే ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్- టీఆర్‌ఎస్ (Congress TRS) మధ్య ఎలాంటి అవగాహన లేదని కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే ఎన్నికల్లో పోరాడుతుందని ప్రకటించారు. బీఆర్‌ఎస్ (BRS) ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చని తమకు అభ్యంతరం లేదన్నారు. బీజేపీ (BJP), టీఆర్‌ఎస్ ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయని దుయ్యబట్టారు. బీజేపీ, టీఆర్‌ఎస్ రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు.
మోదీ అన్ని వ్యవస్థలను నాశనం చేశారు: రాహుల్
‘‘ప్రధాని మోదీ అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సమూల మార్పులు చేస్తాం. ఆర్‌ఎస్‌ఎస్ కబంధహస్తాల నుంచి దేశానికి విముక్తి కల్పిస్తాం. బీజేపీ, టీఆర్‌ఎస్ వ్యాపారవేత్తలకే లాభం చేస్తున్నాయి. బీజేపీ విద్వేషానికి వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర చేస్తున్నాం. జోడో యాత్రలో ఎవరైనా పాల్గొనవచ్చు. బీజేపీ విద్వేషంతో దేశానికి చాలా చెడ్డ పేరు వచ్చింది. ప్రతి రాష్ట్రం నుంచి యాత్ర వెళ్లడం సాధ్యం కాదు. ఎక్కువ రాష్ట్రాలను జోడో యాత్రలో కవర్ చేస్తున్నాం. బీజేపీ ఆర్థిక విధానాలను అందరూ వ్యతిరేకించాలి. మోదీ కార్పొరేట్ వర్గాల కోసమే పనిచేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి కట్టుబడి నడిచే పార్టీ కేవలం కాంగ్రెస్. మోదీ మీడియాను కూడా నియంత్రిస్తున్నారు. అన్ని వ్యవస్థలపై దాడులు చేస్తున్నారు. మోదీ పాలనలో యువతకు ఉద్యోగ కల్పన లేదు’’ అని రాహుల్ విమర్శించారు.