Bharat Jodo Yatra: సంగారెడ్డిలో సందడి చేసిన రాహుల్‌గాంధీ
ABN , First Publish Date - 2022-11-03T19:45:31+05:30 IST
భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో గురువారం సందడి చేశారు.
సంగారెడ్డి: భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో గురువారం సందడి చేశారు. పాదయాత్ర చేస్తున్న రాహుల్‌గాంధీ రోడ్డుకిరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. 6.15 గంటలకు గణేశ్‌గడ్డ నుంచి పాదయాత్ర ప్రారంభంచిన రాహుల్‌గాంధీ 7.50కి సంగారెడ్డి చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ ఓ హోటల్ సెల్లార్‌లో కళాకారులతో కలిసి కాసేపు నృత్యం చేశారు. రాహుల్ తో పాటు పీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిండెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్యే సీతక్క నృత్యం చేస్తూ జోష్ నింపారు. అనంతరం సంగారెడ్డి పట్టణంలో రాహుల్‌గాంధీకి అడుగడుగునా కార్యకర్తలు, వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులు సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. చర్చి వద్దకు ఆయన రాగానే పాస్టర్లు పూలు చల్లుతూ ఆశీర్వదించారు. ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీ విద్యార్థినులు ఆయనను కలిసి తమకు కాలేజీలో ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు.
విద్యార్థినులతో కలిసి నడుస్తూనే వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కరెంట్ ఆఫీసు ఎదురుగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద పోతరాజుల విన్యాసాలు రాహుల్ గాంధీని ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరిక మేరకు రాహుల్‌గాంధీ పోతరాజులతో కలిసి విన్యాసం చేయడమే కాకుండా కొరడా ఝలిపించారు. ఆయన కొరడా చేతబట్టి కోట్టుకోవడం ఆకట్టుకుంది. జిల్లా కేంద్ర ఆస్పత్రి వద్ద దివ్యాంగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రం అందజేశారు. ముత్స్య కార్మికులు టోపీ, చేపల బుట్టను అందజేశారు. మత్స్యకార్మికులు పెట్టుకునే టోపిని రాహుల్ ధరించారు. రామ్‌మందిర్ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌లో దివంగత ఇందిరాగాంధీ కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలను ఆయన వీక్షించారు. అనంతరం నవరత్నాలయంలో పూజలు చేసి హారతి తీసుకున్నారు. ఆలయ ఆవరణలో నిర్వహిస్తున్న గోశాలను సందర్శించారు.