Bharat Jodo Yatra: జోడోయాత్రలో రాహుల్ భిన్నశైలి
ABN , First Publish Date - 2022-10-28T18:44:57+05:30 IST
భారత్ జోడోయాత్ర (Bharat Jodo Yatra)లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ Rahul Gandhi) భిన్నశైలితో ముందుకుపోతున్నారు. ఏప్రాంతంలో యాత్ర కొనసాగితే ఆ ప్రాంతంలో ఉన్న స్థానిక ప్రజలతో సమ్మిళతమవుతున్నారు.
మహబూబ్‌నగర్: భారత్ జోడోయాత్ర (Bharat Jodo Yatra)లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ Rahul Gandhi) భిన్నశైలితో ముందుకుపోతున్నారు. ఏప్రాంతంలో యాత్ర కొనసాగితే ఆ ప్రాంతంలో ఉన్న స్థానిక ప్రజలతో సమ్మిళతమవుతున్నారు. విద్యార్థులు, కార్మికులు మొదలుకొని వీలైనంత ఎక్కువ వర్గాలను జోడోయాత్రలో భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో భిన్న సమస్యలపై పనిచేస్తోన్న వివిధ సంఘాలు, వర్గాల నాయకులతో పాదయాత్రలో కలుస్తూ వారి చెప్పే సాధకబాధకాలు సావధానంగా వినడమే కాకుండా ఆయా సమస్యలు, ఇబ్బందుల శాశ్వత పరిష్కారానికి ఏం చేయాలో ఆలోచించాలని సూచిస్తున్నారు.
పాలమూరులో అడుగుపెట్టాక రాహుల్‌గాంధీ ఇప్పటివరకు బీడీ కార్మికులు, రైతుకూలీలు, రైతులు, కౌలు రైతులు, చేనేత కార్మికులు, పోడు రైతులు, గిరిజనులు, మాదాసి కుర్వలు, కార్మిక సంఘాల నాయకులు, కులనిర్మూలన పోరాట సమితి నాయకులు, ట్రాన్స్‌జెండర్స్ అండ్ ఉమెన్స్ అసోసియేషన్ నాయకులు, వలస కార్మిక సంఘాల నాయకులు, ప్రైవేట్ ఉద్యోగులు, పింఛన్‌దారులు ఇలా భిన్నవర్గాల నాయకులు ఆయన్ను కలిసి తమ సమస్యలను ఆయనతో పంచుకున్నారు. ఉపాధ్యాయులు, నిరుద్యోగుల సమస్యలపైనా పలుసంఘాల నాయకులు ఆయన్ను కలిసి విన్నవించుకున్నారు. ఒగ్గు కళాకారులు, గొల్లసుద్దుల కళాకారులు, డప్పు కళాకారులు, చెక్కభజనల కళాకారులు తదితర కళా ప్రదర్శనలను ఆయన తిలకించడమే కాకుండా వారితో మమేకమై వారి సమస్యలను ఆలకిస్తున్నారు.
మొత్తంగా రాహుల్‌గాంధీ భారత్ జోడోయాత్రతో దేశంలోని మూలమూలకు ఉన్న సమాజాల స్థితిగతులు, జీవన పరిస్థితులను అవలోకనం చేసుకునే అవకాశంతో పాటు విద్యార్థులతో అనుసంధానమవడం ద్వారా భవిష్యత్ భారతపౌరుల ఆలోచనాసరళి ఎలా ఉన్నదో గమనిస్తోన్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా రాహుల్‌గాంధీ కొనసాగిస్తోన్న భారత్‌జోడో యాత్ర సాగుతోన్న తీరుపై మేధావులు, ఆలోచనాపరులు లోతుగా పరిశీలిస్తుండటం దేశంలో రాబోయే మార్పులకు సంకేతంగా కనిపిస్తున్నాయి.