MLAs Purchase case: సిట్ దూకుడు.. బండి సంజయ్ అనుచరుడికి నోటీసులు
ABN , First Publish Date - 2022-11-17T18:45:33+05:30 IST
ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) అనుచరుడు బుసారపు శ్రీనివాస్‌కు నోటీసులిచ్చారు.
హైదరాబాద్: ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) అనుచరుడు బుసారపు శ్రీనివాస్‌కు నోటీసులిచ్చారు. 41 సీఆర్‌పీసీ (CRPC) కింద సిట్ నోటీసులిచ్చింది. ఈనెల 21న సిట్ విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. రామచంద్ర భారతికి ఫ్లైట్ టికెట్లు కొనుగోలు చేసినట్లు శ్రీనివాస్‌పై ఆరోపణలున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా కేరళ (Kerala)లో రెండు బృందాలతో సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కొచ్చి, కొల్లంలో సిట్ తనిఖీలు నిర్వహించారు. ఈ కేసులో కొత్తగా వెలుగులోకి వచ్చిన తుషార్ అనే వ్యక్తి కేరళ ఎన్డీఏ కన్వీనర్‌గా పని చేసినట్టు గుర్తించారు. భారత ధర్మ జనసేన పార్టీ నేతగా అధ్యక్షుడు తుషార్ ఉన్నారు. బీజేపీ మద్దతుతో వాయనాడు నుంచి రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేశాడు. నవంబర్ 21వ తేదీన విచారణకు రావాలని తుషార్‌కు సిట్ ఆదేశాలు జారీ చేసింది. రామచంద్ర భారతి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌తో తుషార్ మాట్లాడినట్టు తెలుస్తోంది.
మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరిన్ని అరెస్టులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడంలో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉన్నట్లు తేలితే.. వారిని కూడా నిందితులుగా చేర్చాలని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకోసం కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా ఏడు బృందాలతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. తెలంగాణతోపాటు ఫరీదాబాద్, కేరళ మరికొన్ని ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. మరోవైపు మొయినాబాద్ ఫాంహౌస్‌లో పట్టుబడ్డ ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్‌ల నెట్‌వర్క్‌ను ట్రేస్ చేస్తోంది. నిందితుల కాల్ డేటా, డైరీల ఆధారంగా కీలక సమాచారం కోసం సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఫిల్మ్‌నగర్‌లోని నందకుమార్‌కు చెందిన డెక్కన్ కిచెన్ హోటల్, షేక్‌పేట, చైతన్యపురిలోని ఆయన ఇళ్లలో సోదాలు నిర్వహించారు. మరోవైపు ప్రధాన నిందితుడైన రామచంద్ర భారతికి చెందిన ఫరీదాబాద్, ఆయన ఎక్కువగా తిరిగే కేరళలో ఆదివారం సోదాలు చేశారు. ఇక తిరుపతిలోని సింహయాజికి చెందిన ప్రాంతాల్లో పలువురిని విచారించినట్లు సమాచారం.