Bandi Sanjay: కన్నీటిపర్యంతమైన బండి సంజయ్
ABN , First Publish Date - 2022-11-22T20:25:34+05:30 IST
భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ భావోద్వేగానికి గురయ్యారు.
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్స్‌లో నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ ప్రధాన కార్యదర్శి, సంఘ్ ప్రచారక్ అయిన బీఎల్ సంతోష్‌కు టీఆర్ఎస్ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంపై బండి సంజయ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. సంఘ్ ప్రచారక్‌లను కేసీఆర్ అవమానపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎంపీ, ఎమ్మెల్యే కావాలని బీఎల్ సంతోష్ అనుకోలేదని, ఆస్తులు కూడబెట్టలేదని, విదేశాల్లో వ్యాపారం చేయలేదని చెప్పారు. ఢిల్లీ మద్యం స్కామ్ నుంచి బయట పడేందుకే సంతోష్‌ను అవమానిస్తున్నారని బండి సంజయ్ వాపోయారు. బీఎల్ సంతోష్ జోలికి వస్తే ఊరుకోబోమని, సహించబోమని స్పష్టం చేశారు.
కేసీఆర్ కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నారని, సంక్షేమ పథకాలను తప్పుదోవ పట్టిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ దుర్మార్గాలను గ్రహించిన కేంద్రం గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు మంజూరు చేస్తూ... నిధులు దారి మళ్లకుండా చర్యలు తీసుకుంటుంటే... దానిని కూడా టీఆర్ఎస్ తప్పుపడుతోందని ఆయన ఆరోపించారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను చిప్ప చేతికిచ్చి అడుక్కునే స్థాయికి కేసీఆర్ దిగజార్చారని బండి సంజయ్ విమర్శించారు. ప్రస్తుతం ఏటా రూ.30 వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నారని, కేసీఆర్‌కు మళ్లీ అవకాశమిస్తే... మరో 5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేస్తారని బండి సంజయ్ చెప్పారు. కేసీఆర్ పాలన బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. టీఆర్ఎస్‌ను ఓడించేందుకు సిద్ధమని, యుద్ధానికి బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని బండి సంజయ్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడించేందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టులతో పాటు అన్నీ పార్టీలు టీఆర్ఎస్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధమవుతున్నాయన్నట్లు కేసీఆర్ సంకేతాలు పంపుతున్నారని బండి సంజయ్ చెప్పారు.