Praja Sangrama Yatra: అనుమతినిచ్చినా అనేక షరతులు!

ABN , First Publish Date - 2022-11-28T13:05:12+05:30 IST

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay Kumar) తలపెట్టిన 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర (Praja Sangrama Yatra)కు హైకోర్టు అనుమతినిచ్చింది.

Praja Sangrama Yatra: అనుమతినిచ్చినా అనేక షరతులు!
Bandi Sanjay Kumar

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay Kumar) నేటి నుంచి డిసెంబర్ 16 వరకూ తలపెట్టిన 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర (Praja Sangrama Yatra)కు హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే భైంసా పట్టణానికి 3 కిలోమీటలర్ల దూరంలో సభ నిర్వహిస్తేనే అనుమతిస్తామని హైకోర్టు షరతులు విధించింది. భైంసా పట్టణంలోకి వెళ్లకుండా పాదయాత్ర కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది. 500 మందితో మాత్రమే పాదయాత్ర చేయాలని, 3 వేల మందితో సభ జరుపుకోవాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. సభకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అనుమతినిచ్చింది.

వాస్తవానికి ప్రజాసంగ్రామ యాత్రకు నిర్మల్‌ జిల్లా పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. భైంసాలో సున్నితమైన పరిస్థితుల దృష్ట్యా అనుమతి నిరాకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. బహిరంగసభతో పాటు యాత్రకు కూడా భద్రత ఇవ్వలేమన్నారు.

హైకోర్టులో బీజేపీ తరపున రామచందర్ రావు వాదనలు వినిపించారు. బైంసా లోపలి నుంచి పాదయాత్ర వెళ్ళదని కోర్టుకు తెలిపారు. రూట్ మ్యాప్ వివరాలు కోర్టుకు సమర్పించారు. బైంసా వై జంక్షన్ నుంచి పాదయాత్ర వెళ్తుందన్నారు. బైంసా టౌన్ లోకి పాదయాత్ర ఎంటర్ కాదని స్పష్టం చేశారు. బైంసా టౌన్ లోకి ఎంటర్ కానప్పుడు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. బైంసా చాలా సున్నితమైన ప్రాంతమని ఏజీ బిఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు. అయితే వాదనలు విన్న అనంతరం హైకోర్టు షరతులతో అనుమతినిచ్చింది.

ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ ఇప్పటివరకూ 4 విడతల్లో 21 జిల్లాల్లోని 1178 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేశారు. ఐదో విడత పాదయాత్ర ఆయన బాసరలో పూజలు చేసి భైంసాలో ప్రారంభించి కరీంనగర్‌లో ముగించాలనుకున్నారు.

హైకోర్టు షరతులతో కూడిన అనుమతినీయడంతో పాదయాత్రను ఈ నెల 29నుంచి ప్రారంభించాలని బండి సంజయ్ నిర్ణయించారు. సభ కూడా రేపే (మంగళవారం) నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - 2022-11-28T13:25:06+05:30 IST