ACB: ఏపీలో సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ దాడులు.. ఎందుకంటే..
ABN , First Publish Date - 2023-04-26T17:25:52+05:30 IST
ఏపీలోని పలు సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో (sub-registrar offices) ఏసీబీ దాడులు (ACB raids) కొనసాగుతున్నాయి.
అమరావతి: ఏపీలోని పలు సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో (sub-registrar offices) ఏసీబీ దాడులు (ACB raids) కొనసాగుతున్నాయి. కడపలోని బద్వేల్, నెల్లూరులోని కందుకూరు, అనంతపురం, తిరుపతి, విశాఖలోని సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. పలువురు సిబ్బంది అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ దాడులకు ప్రాధాన్యం సంతరించుకుంది. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు.
కాగా.. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక, రెవెన్యూ విభాగాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శివనారాయణస్వామి నేతృత్వంలోని బృందం ఈ తనిఖీల్లో పాల్గొంది. నివాస గృహాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, వాణిజ్య పరమైన భారీ భవంతుల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడంలో, కొన్ని భవనాలను క్రమబద్ధీకరించడంలో సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారనే ఫోన్‌కాల్ ఫిర్యాదు మేరకు ఆకస్మిక తనిఖీకి ఏసీబీ అధికారులు వచ్చారు. పట్టణ ప్రణాళిక, రెవెన్యూ సెక్షన్లలోకి వెళ్లి తలుపులు మూసి రికార్డులను తనిఖీ చేశారు. రెండు విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిని పూర్తిస్థాయిలో విచారించారు. తనిఖీలు జరుగుతున్న సమయంలో ఇతరులను ఎవరినీ లోపలికి అనుమతించలేదు. రాత్రి పొద్దుపోయే వరకు ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు.
మున్సిపాల్టీ పరిధిలో మొత్తం 42వార్డులు ఉన్నాయి. సచివాలయ వ్యవస్థ ఏర్పడ్డాకభవన నిర్మాణాలకు అనుమతులు, క్రమబద్ధీకరణ, కొత్త భవనాలకు పన్నుల విధింపు ఇలా ప్రతి అంశాన్ని సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. సచివాలయాల్లో అప్‌లోడ్ అయిన పైళ్లు మున్సిపల్ కార్యాలయంలోని విభాగాలకు ఆన్‌లైన్‌లోనే సెక్షన్ ఇన్‌చార్జిల పరిశీలనకు చేరుతాయి. సెక్షన్ ఇన్‌చార్జిలు, సంబంధిత అధికారుల పరిశీలన పూర్తయిన తరువాత అనుమతుల మంజూరు, నిరాకరణ తదితర నిర్ణయాలు తీసుకుంటారు. అనుమతులు మంజూరైతే ఆన్‌లైన్ ద్వారానే సచివాలయాలకు వెళ్లి దరఖాస్తుదారులు ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలి.
భవన నిర్మాణాల అనుమతుల కోసం సచివాలయాల నుంచి అప్‌లోడ్ అయిన దరఖాస్తులను పట్టణ ప్రణాళిక, రెవెన్యూ సెక్షన్లలో పనిచేస్తున్న సిబ్బంది కుమ్మక్కై పరిశీలనలో తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. అనుమతుల కోసం పట్టణ ప్రణాళిక విభాగంలోని సిబ్బందిని సంప్రదించాక.. వారు పైల్‌కు ఓ రేటు వంతున ముడుపులు తీసుకొని, నేరుగా సచివాలయాలకు వెళ్లి దగ్గరుండి అప్‌లోడ్ చేయించి, అనుమతులు మంజూరు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. రెవెన్యూ సెక్షన్‌లో ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన లావాదేవీలు జరిగినప్పుడు యజమానుల పేరు మార్పులకు ఫైల్‌కు రూ.వేలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మున్సిపాల్టీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదులు వెళ్లడంతో ఏసీబీ అధికారులు రంగంలో దిగి విచారణ చేయడం అధికార వర్గాల్లో కలకలం రేపింది.