ACB: సబ్‌ రిజిస్ట్రార్, తహశీల్దార్‌ ఆఫీస్‌లపై ఏసీబీ సోదాలు.. కోట్ల నగదును..

ABN , First Publish Date - 2023-04-27T21:29:09+05:30 IST

సబ్‌ రిజిస్ట్రార్ (Sub-Registrar), తహశీల్దార్‌ (Tehsildar) కార్యాలయాలపై ఏసీబీ (ACB) దాడులు చేస్తోంది.

ACB: సబ్‌ రిజిస్ట్రార్, తహశీల్దార్‌ ఆఫీస్‌లపై ఏసీబీ సోదాలు.. కోట్ల నగదును..

అమరావతి: సబ్‌ రిజిస్ట్రార్ (Sub-Registrar), తహశీల్దార్‌ (Tehsildar) కార్యాలయాలపై ఏసీబీ (ACB) దాడులు చేస్తోంది. రెండు రోజులుగా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా 7 సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీసులు, 2 తహశీల్దార్ ఆఫీసుల్లో తనిఖీలు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. రూ.19.28 లక్షల అనధికారిక నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. సబ్‌ రిజిస్ట్రార్‌లతో పాటు పలువురిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.

తిరుపతి రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ కార్యాలయంలో అవినీతి జరుగుతోందని, అక్రమంగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారని పెద్దఎత్తున ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 14400కి ఫిర్యాదులు అందిన క్రమంలో ఏఎస్పీ దేవప్రసాద్‌ నేతృత్వంలో డీఎస్పీ జనార్దన నాయుడు, ఐదుగురు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలు, 10 మంది సిబ్బంది బుధవారం మధ్యాహ్నం 3.15 గంటలకు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం లోంచి ఎవరినీ బయటకు పోనీయ్యకుండా చర్యలు తీసుకున్నారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులు, సిబ్బంది సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయ తలుపులు మూసేసి తనిఖీలు ప్రారంభించారు. కార్యాలయం లోపలున్న ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించి దళారులుగా నిర్ధారించుకున్నారు. వారు ఏ లావాదేవీల నిమిత్తం వచ్చారో తెలుసుకుని ఆ రిజిస్ట్రేషన్లను, లావాదేవీలను పరిశీలించారు.

అలాగే బుధవారం జరిగిన మొత్తం రిజిస్ట్రేషన్లు ఎన్ని, వాటికిగాను ఎంతమేరకు నగదు లావాదేవీలు జరిగాయో పరిశీలించారు. అకౌంట్స్‌ సెక్షన్‌లో అకౌంట్లను, నగదును పరిశీలించి లెక్కతేల్చిన ఏసీబీ అధికారులు జరిగిన లావాదేవీలకంటే 1.53 లక్షల రూపాయలు అదనంగా ఉన్నట్టు గుర్తించి సీజ్‌ చేశారు. పలు రికార్డులతో పాటు ఆన్‌లైన్‌లో కూడా ఏసీబీ అధికారులు పరిశీలించారు. అనుమానం వచ్చిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన దస్త్రాల గురించి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ అధికారులను అడిగినప్పటికీ చెప్పలేక పోయినట్టు తెలుస్తోంది. పలు రిజిస్ట్రేషన్లను పెండింగ్‌లో ఉంచినట్టు గుర్తించి వాటికి సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం ప్రారంభమైన ఏసీబీ తనిఖీలు అర్థరాత్రి దాటిన తరువాత కూడా కొనసాగాయి.

Updated Date - 2023-04-27T21:32:40+05:30 IST