Anam Venkata Ramana Reddy : తాడేపల్లి ప్యాలెస్‌లో సజ్జల ఎలాగో.. టీటీడీలో ధర్మారెడ్డి అలా..
ABN , First Publish Date - 2023-11-16T13:39:27+05:30 IST
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారపార్టీ నేతల అవినీతికి అడ్డాగా మారిందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి పేర్కొన్నారు. భూమున కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయ్యాక దేవస్థానం డబ్బుల్ని తన కొడుకు అభినవ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేస్తున్నారన్నారు.
అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం అధికారపార్టీ నేతల అవినీతికి అడ్డాగా మారిందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి పేర్కొన్నారు. భూమున కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయ్యాక దేవస్థానం డబ్బుల్ని తన కొడుకు అభినవ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేస్తున్నారన్నారు. తిరుపతి పరిధిలో ఏ పనికైనా 10 శాతం తీసుకుంటున్న భూమన కరుణాకర్ రెడ్డిని ఇప్పటికే 10శాతం కరుణాకర్ రెడ్డిగా పిలుస్తున్నారన్నారు.
టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన స్థలాల చుట్టూ అభినవ రెడ్డి 5.45ఎకరాలు ఎలా కొనుగోలు చేశాడో కరుణాకర్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆనం వెంకటరమణా రెడ్డి నిలదీశారు. తిరుమల శ్రీవారి సొమ్ము తిన్న ప్రతీ రూపాయి తెలుగుదేశం అధికారంలోకి రాగానే కక్కిస్తామన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో సజ్జల ఎలాగో టీటీడీలో ధర్మారెడ్డి వ్యవహారం అలానే ఉందన్నారు. ధర్మారెడ్డి అవినీతిపై 14 సెక్షన్ల కింద ఢిల్లీలో క్రిమినల్ కేసు నమోదైందని ఆనం తెలిపారు. తనపై ఉన్న క్రిమినల్ కేసుని దాచిపెట్టి ధర్మారెడ్డి టీటీడీ ఈవో అయ్యారని విమర్శించారు. ఐఎఎస్‌లను కాదని, క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తికి టీటీడీలో కీలక పదవి ఎలా ఇస్తారని ఆనం ప్రశ్నించారు. టీటీడీని అడ్డం పెట్టుకుని ఢిల్లీలో ధర్మారెడ్డి లాబీయింగ్ చేస్తున్నాడన్నారు. ఢిల్లీలో నమోదైన కేసుపై తీర్పు వచ్చే వరకూ ధర్మారెడ్డిని టీటీడీ బాధ్యతల నుంచి తప్పించాలని ఆనం డిమాండ్ చేశారు.