భార్య ప్రవర్తన నచ్చక..
ABN , First Publish Date - 2023-03-31T03:08:55+05:30 IST
భార్య ప్రవర్తన నచ్చక ఓ వ్యక్తి తన ఇద్దరు కొడుకులతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
రెండు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యం
అనంతపురం క్రైం, మార్చి 30: భార్య ప్రవర్తన నచ్చక ఓ వ్యక్తి తన ఇద్దరు కొడుకులతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం నగర శివారు రంగస్వామి నగర్‌కు చెందిన రఫి బేల్దారి పని చేసేవాడు. అతని భార్య బాను టైలరింగ్ చేస్తోంది. వీరి కుమారులు ఇమ్రాన్ మూడో తరతగతి, సోహైల్ ఒకటో తరగతి చదువుతున్నారు. ఈ నెల 28వ తేదీ రఫీ భార్యతో గొడవపడి ఆమెపై చేయి చేసుకున్నాడు. ఆ తరువాత ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి రాకపోవడంతో త్రీటౌన్ పోలీసులకు బాను తల్లి షేక్ రజియా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రఫీ (35), ఇమ్రాన్ (9), సోహైల్ (6) మృతదేహాలు గురువారం నగర శివారులోని బుక్కరాయసముద్రం చెరువులో తేలాయి. పోలీసులు ముగ్గురి మృతదేహాలను బయటకు తీయించారు. కాగా.. రఫీ జేబులో రెండు పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన భార్య ప్రవర్తన నచ్చక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని రఫీ లేఖలో పేర్కొన్నాడు. నెల క్రితం పెద్దల పండుగకు తాను హిందూపురం వెళ్లానని, ఆ సమయంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తిని తన భార్య ఇంటికి పిలిపించుకుందని పేర్కొన్నాడు. ఎంతచెప్పినా ఆమె వినలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఖురాన్ చదువుతావు. భర్త, పిల్లలు ఉన్నారు. పరాయి వ్యక్తితో అలా ఉండటం సరికాదు కదా..? ఆ విషయం నన్ను కలిచివేసింది. కాల్ రికార్డ్ ద్వారా ఈ విషయం తెలిసింది. మీకు మేము అడ్డుగా ఉన్నామని బాధపడాల్సిన అవసరం లేదు. ముగ్గురం వెళ్తున్నాం. నువ్వు అతనితోనే సంతోషంగా ఉండు’ అని రఫీ లేఖలో రాశాడు.