SKUలో హోమంపై రిజిస్ట్రార్ స్పందన ఇదే..

ABN , First Publish Date - 2023-02-20T14:17:12+05:30 IST

శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ (SKU)లో మృత్యుంజయ హోమం నేపథ్యంలో తలెత్తిన విమర్శలపై రిజిస్ట్రార్ లక్ష్మయ్య స్పందించారు.

SKUలో హోమంపై రిజిస్ట్రార్ స్పందన ఇదే..

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ (SKU)లో మృత్యుంజయ హోమం నేపథ్యంలో తలెత్తిన విమర్శలపై రిజిస్ట్రార్ లక్ష్మయ్య (University Registrar Laxmaiah) స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. హోమం చేయడం అనేది ఎవరి వ్యక్తిగతం వారిదని... ఎవరిని బలవంతం చేయడం లేదన్నారు. యూనివర్సిటీ తరఫున హోమం నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. నాన్ టీచింగ్ స్టాఫ్ వరుస మరణాలతో కొంత ఆందోళన ఉందని... అందుకే ఉద్యోగులంతా కలిసి హోమం చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. తాము ఇందులో పాల్గొనమని ఎవరినీ బలవంతం చేయడం లేదని తెలిపారు. హోమం నిర్వహించాలా వద్దా అన్నది ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. తమ దృష్టిలో భగవంతుడు ఒక్కడే.. అందరి అభిప్రాయాలను గౌరవిస్తామని చెప్పుకొచ్చారు.

కాగా.. ఎస్కేయూలో మృత్యుంజయ హోంపై రిజిస్ట్రార్ జారీ చేసిన సర్క్యూలర్ పలు విమర్శలు దారి తీసింది. ఎస్కేయూలో ఇటీవల వరుస మరణాలతో మృత్యుంజయ హోమం చేయాలని రిజిస్టార్ నిర్ణయించారు. ఇటీవల కాలంలో 25 మంది దాకా వివిధ కారణాలతో సిబ్బంది మరణించారు. ఈ నేపథ్యంలో ఈనెల 24న ఎస్కేయూ క్రీడా వేదికలో ధన్వంతరి మహా మృత్యుంజయ శాంతి హోమం చేపట్టాలని నిర్ణయించారు. దీనిపై ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మృత్యుంజయ హోమం చేస్తే మరణాలు ఆగిపోతాయా... విశ్వవిద్యాలయంలో హోమం చేయడమేంటంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. మృత్యుంజయ హోమం జరిపేందుకు టీచింగ్‌ సిబ్బంది రూ. 500, నాన్ టీచింగ్ రూ.100లు విరాళాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడంపై విద్యార్థి సంఘాలతో పాటు హేతువాదులు విమర్శలు గుప్పిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎస్కేయూ వద్ద విద్యార్థి సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కాగా.. ఇప్పటికే ఎస్కేయూలో వీసీతో పాటు రిజిస్టార్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు వివాదంగా మారుతున్నాయి. ఈ తరుణంలో ఈనెల 24న మృత్యుంజయ హోమం జరుపుతున్నట్లు ఆదేశాలు జారీ చేయడం పట్ల విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు మృత్యుంజయ హోమంపై ఏబీఎన్‌ - ఆంద్రజ్యోతిలో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. విమర్శల జడివానకు జంకి వీసీ ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. శ్రీకృష్ణదేవరాయల యూనివర్శిటీలో ఈనెల 24న మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నట్లు ఎస్కేయూ వీసీ ఆదేశాల మేరకు ఎస్కేయూ రిజిస్టార్ సర్క్యులర్ జారీ చశారు. దీనిపై ఏబీఎన్ -ఆంధ్రజ్యోతి వరుస కథనాలను ప్రచురితం చేసింది. దీంతో హుటాహుటిన ఎస్కేయూ వీసీ, పాలకమండలి సభ్యులు సమావేశమై మృత్యుంజయ హోమంపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. మృత్యుంజయ హోంపై ఎస్కేయూ వీసీ తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-02-20T14:17:13+05:30 IST