AP News: వైఎస్సార్ విగ్రహావిష్కరణ.. ఎస్కేయూలో తీవ్ర ఉద్రిక్తత
ABN , First Publish Date - 2023-11-22T11:28:08+05:30 IST
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో (Srikrishna Devarayala University) వైఎస్సార్ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బుధవారం యూనివర్సిటీలో వైఎస్ విగ్రహావిష్కరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థి నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో విద్యార్థుల చొక్కాలను పోలీసులు చింపేశారు. అయితే ఉద్రిక్తత నడుమే వైఎస్ఆర్ విగ్రహాన్ని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి (Raptadu MLA Topudurthi Prakash Reddy), ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav) ఆవిష్కరించారు. విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ఈడ్చుకెళ్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు యూనివర్సిటీలో రాజకీయ నేతల విగ్రహాలు వద్దంటూ ఆందోళనలు చేస్తున్నప్పటికీ యూనివర్సిటీ యంత్రాంగం పట్టించుకోని పరిస్థితి. విద్యార్థుల ఆందోళనలను పెడచెవిన పెట్టి మరీ వైఎస్ విగ్రహావిష్కరణకు యూనివర్సిటీ యంత్రాంగం పూనుకుంది.
ఎస్కేయూ వీసీ రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. పదవి కాలాన్ని పెంచుకునే ఆలోచన తనకు లేదన్నారు. విగ్రహ ఆవిష్కరణకు మంచి రోజు అని ఇవాళ పెట్టామన్నారు. తమకు దేశ భక్తి చాలా ఉందని... పూలే విగ్రహం ఉంది కాబట్టి సావిత్రి భాయి విగ్రహం అవసరం లేదన్నారు. వైఎస్ విగ్రహానికి ఒక్క రూపాయి కూడా యూనివర్సిటీ నుంచి కేటాయించలేదని.. దాతల ద్వారా సేకరించామని చెప్పుకొచ్చారు.