Purandeshwari: ఈ ఆత్మహత్యల పాపం జగన్మోహన్ రెడ్డి ది కాదా?
ABN , First Publish Date - 2023-08-10T13:06:07+05:30 IST
రాష్ట్రంలో సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శలు గుప్పించారు.
ప్రకాశం: రాష్ట్రంలో సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeshwari) విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. పంచాయతీల్లో నిధులు లేక అప్పులు చేసి సర్పంచ్‌లు పని చేస్తున్నారని తెలిపారు. సర్పంచ్‌లు నిధులు రాక ఆత్మహత్యలు చేసుకున్న పాపం ప్రభుత్వానిదే అని ఆరోపించారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా చేసిన పనులకు నిధులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఈ ఆత్మహత్యల పాపం జగన్మోహన్ రెడ్డి ది (CM Jaganreddy) కాదా అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన సర్పంచ్ వ్యవస్థను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వ్యాఖ్యలు చేశారు. కేంద్రం పంచాయతీలకు ఇచ్చే నిధులు పక్కదారి పట్టిస్తున్నారన్నారు. సర్పంచ్‌లకు అన్యాయం చేస్తున్నారని బీజేపీ గళం విప్పిన తరువాత వెయ్యి కోట్లు విడుదల చేస్తున్నట్టు చెప్పారన్నారు. రూ.600 కోట్లు విద్యుత్ బిల్లుల కోసం ఆపడం దారుణమని మండిపడ్డారు. మహాత్మాగాంధీని కూడా అవమానపరిచే విధంగా జగన్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. వైసీపీ సర్పంచ్‌లు కూడా బయటకు వచ్చి గళం విప్పుతున్నారని తెలిపారు. సర్పంచ్‌ల ఆందోళనకు జగన్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సర్పంచ్‌లు ఆందోళనకు జనసేన మద్దతు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్‌కు పురందేశ్వరి కృతజ్ఞతలు తెలియజేశారు.