AP BJP Chief: చరిత్రను తిలకించేందుకు సిద్ధంకండి.. చంద్రయాన్ 3పై పురందేశ్వరి
ABN , First Publish Date - 2023-08-23T10:08:08+05:30 IST
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక చంద్రయాన్ -3 సేఫ్ ల్యాండింగ్‌కు అంతా సిద్ధమైంది.
అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) (ISRO) ప్రతిష్టాత్మక చంద్రయాన్ -3 (Chandrayan 3) సేఫ్ ల్యాండింగ్‌కు అంతా సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఇందుకోసం యావత్ ప్రపంచం ఎంతగానో ఎదురు చూస్తోంది. చంద్రయాన్ 3లో కీలక ఘట్టంపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి (AP BJP Chief Daggubati Purandeswari)కూడా స్పందించారు. చరిత్రను తిలకించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. చంద్రయాన్ 3 నిర్దేశించిన చంద్ర భూభాగాన్ని తాకేందుకు సిద్ధమవుతున్న కొద్దీ ఉత్సాహం పెరుగుతుందని అన్నారు. చంద్రయాన్ విజయం కోసం ప్రార్థనలో 1.4 బిలియన్ల హృదయాలను కలుపుతోందన్నారు. ఈరోజు సాయంత్రం 18:04 గంటలకు చరిత్రను తిలకించడానికి ట్యూన్ చేస్తూనే ఉండాలని తెలిపారు. ఇస్రో గొప్ప తనాన్ని, వారి శ్రమ, కృషిని మెచ్చుకోవాలని ప్రజలను పురందేశ్వరి కోరారు.
కాగా.. చందమామపై చెరగని ముద్ర వేసే చరిత్రాత్మక ఘట్టం కోసం యావత్ భారతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రుడిపై పరిశోధనల కోసం గత నెల 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3(Chandrayaan-3) వ్యోమనౌక 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లిపై అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. బుధవారం సాయంత్రం 6:04 గంటలకు ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన విక్రమ్ ల్యాండర్(Vikram Lander) మాడ్యూల్ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని ముద్దాడనుంది. జాబిల్లిపై మన వ్యోమనౌక అడుగుపెట్టే అపురూప ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో(ISRO) అన్ని ఏర్పాట్లూ చేసింది. ఇస్రో ప్రయోగించిన ఈ మూడో మూన్ మిషన్ విజయవంతమైతే అమెరికా, సోవియెట్ యూనియన్ (రష్యా), చైనా తర్వాత చంద్రునిపై దిగిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టించనుంది. అలాగే ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యంకాని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా చరిత్ర సృష్టించనుంది. ఈ నేపథ్యంలో ఈ చరిత్రాత్మక ఘట్టం కోసం భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.