Purandeshwari: పొత్తులపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2023-07-19T12:22:03+05:30 IST

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పొత్తల అంశం ఏపీలో హాట్‌టాపిక్‌గా మారుతోంది. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటారనేది ఉత్కంఠను రేపుతోంది. తాజాగా పొత్తుల విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పొత్తుల విషయం తమ కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని తెలిపారు.

Purandeshwari: పొత్తులపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి ఏమన్నారంటే...

అమరావతి: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పొత్తల అంశం ఏపీలో హాట్‌టాపిక్‌గా మారుతోంది. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటారనేది ఉత్కంఠను రేపుతోంది. తాజాగా పొత్తుల విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (AP BJP Chief Daggubati Purandeshwari) స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పొత్తుల విషయం కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని తెలిపారు. సరైన సమయంలో సరైన నిర్ణయం బీజేపీ పెద్దలు తీసుకుంటారని చెప్పారు. ‘‘జనసేన మా మిత్రపక్షం... పోన్‌లో పవన్ కళ్యాణ్‌తో మాట్లాడాను... త్వరలో అవకాశం బట్టి కూర్చుని మాట్లాడుకుంటాం’’ అని ఏపీ బీజేపీ చీఫ్ వెల్లడించారు.

అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలి...

నేడు ఏపీ అప్పుల ఆంధ్రగా, అంధకార ఆంధ్రప్రదేశ్‌గా మారిందని.. ఏపీపై విభజన నాటికి రూ.97వేల‌ కోట్ల భారం ఉందని చెప్పారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో‌ రూ.2,65,365 కోట్లు అప్పు చేశారని.. నలభై వేల కోట్లు కాంట్రాక్టర్‌లకు బిల్లులు చెల్లించలేదని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జులై వరకు నాలుగేళ్లల్లో రూ.7,14,631 కోట్లు అప్పు చేశారన్నారు. రూ.2లక్షల 39వేల 716 కోట్లు అధికారికంగా, రూ.4లక్షల 74వేల 315 కోట్లు అనధికారికంగా అప్పు తెచ్చారన్నారు. ఈ అనధికార అప్పే నేడు ఏపీ అభివృద్ధికి నిరోధకంగా మారిందని వెల్లడించారు. లిక్కర్ బాండ్స్ ద్వారా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి తెచ్చారన్నారు. ఉద్యోగులను తాకట్టు పెట్టి, ప్రభుత్వ సంస్థలను పెట్టి అప్పులు చేశారని విమర్శించారు. గ్రామ పంచాయతీ నిధులు మళ్లించారన్నారు. స్టేట్ డిజార్డర్స్ ఫండ్ కూడా మళ్లించేశారని మండిపడ్డారు. సింకింగ్ ఫండ్‌ను కూడా వదిలి పెట్టలేదన్నారు. ఉద్యోగుల పి.ఏఫ్ నుంచి, ఇ.యస్.ఐ నుంచి, జనరల్ పీఎఫ్ నుంచి ఇలా అనేక మార్గాల్లో అనధికారికంగా రూ. 4,74,315 కోట్లు తెచ్చారని వ్యాఖ్యలు చేశారు. తీసుకున్న అప్పులకు యాభై వేల‌కోట్ల రూపాయలు వడ్డీ కింద కడుతున్నారని తెలిపారు. అనధికారికంగా తీసుకువస్తున్న అప్పులపై జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మద్యంపై రాబోయే ఆదాయం చూపి అప్పు తేవడం దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. ప్రభుత్వం ఆస్తులను తనఖా పెట్టి డబ్బులు తేవడం చూస్తే జగన్మోహన్ రెడ్డి తీరు అర్ధం అవుతుందని తెలిపారు. అప్పులు తెచ్చి పనులు చేసిన కాంట్రాక్టర్‌లు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. గ్రామ సర్పంచ్‌ను ప్రజలు ఎన్నుకుంటే వారికి విలువ లేకుండా చేశారన్నారు. సర్పంచ్‌ల ఖాతాల్లో వేసిన డబ్బులను మళ్లించిన ఘతన జగన్మోహన్ రెడ్డి దే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా నేడు సర్పంచ్‌లు ఒకే వేదికపైకి వచ్చి పోరాటం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బెన్‌ఫిట్‌లు ఇవ్వకుండా నిధులు మళ్లించారని విరుచుకుపడ్డారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు భరోసా లేకుండా చేశారన్నారు. అసలు జీతాలు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని‌ పరిస్థితి దాపురించిందన్నారు. ఇంత దుర్భరంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఉందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం జగన్‌కు అండగా ఉందనేది అపోహ మాత్రమే అని... అధికారికంగా తీసుకున్న అప్పుల వరకే కేంద్రం బాధ్యత అని స్పష్టం చేశారు. అనధికార అప్పులకు కేంద్రానికి సంబంధం లేదన్నారు. ఆర్థిక వ్యవస్థపై జగన్ ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరిస్తూనే ఉందన్నారు. జగన్ ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటున్నారని విమర్శించారు. ఈ అంశాలను మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరిస్తామని పురంధేశ్వరి పేర్కొన్నారు.

మరోవైపు బెంగుళూరులో జరిగిన సమావేశంలో విభిన్న సిద్దాంతాల పార్టీలు కలిశాయన్నారు. ఖర్గే దేశం‌ కోసం కాకుండా బీజేపీని ఓడించడానికి వచ్చామని చెప్పారని పురంధేశ్వరి తెలిపారు.

Updated Date - 2023-07-19T12:22:03+05:30 IST