YS Jagan: రాజ్యాధికారం కోసం జగన్ మహాయజ్ఞం... రేపటి నుంచి..
ABN , First Publish Date - 2023-05-11T14:06:15+05:30 IST
రాజ్యాధికారం కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు.
అమరావతి: రాజ్యాధికారం కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. రేపటి (శుక్రవారం) నుంచి ఆరురోజుల పాటు చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కొనసాగనుంది. మహాయజ్ఞానికి సంకల్పం చెప్పేందుకు సీఎం జగన్ (AP CM) రేపు ఇందిరా గాంధీ స్టేడియానికి రానున్నారు. 108 గుండాలతో , నాలుగు ఆగమనాలతో, 500 మంది రిత్వికులతో మహాయజ్ఞం జరగనుంది. భారీ పోలీస్ బందోబస్తుతో దేవాదాయశాఖ ఈ యాగాన్ని నిర్వహిస్తోంది. మహాయజ్ఞానికి సంబంధించి డీసీపీ విశాల్ గున్నీ ఎప్పటికప్పుడు అక్కడి విషయాలను పరిశీలిస్తున్నారు.
రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలకు చెందిన సూపరింటెండెంట్ స్థాయి అధికారులు మొదలుకొని కమిషనర్ వరకూ ఈ యజ్ఞానికి హాజరుకానున్నారు. ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ యజ్ఞం జరుగనుంది. సాయంత్రం 6 గంటల నుంచి సోత్త్ర పారాయణాలు, ప్రవచనాలు, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగనున్నాయి. వీటితో పాటు ప్రధాన ఆలయాలకు చెందిన దేవతామూర్తుల కళ్యాణ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆఖరి రోజు ఈనెల 17న పూర్ణాహుతితో మహాయజ్ఞం ముగియనుంది. మొదటిరోజు, ఆఖరిరోజు రాజశ్యామల యజ్ఞంలో సీఎం జగన్‌మోహన్ రెడ్డి పాల్గొననున్నారు.