AP Highcourt: అమరావతి రైతులకు కౌలు చెల్లింపుపై హైకోర్టులో విచారణ.. వాయిదా
ABN , First Publish Date - 2023-10-16T16:02:37+05:30 IST
రాజధాని అమరావతిలో భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లింపుపై హైకోర్టులో విచారణ జరిగింది.
అమరావతి: రాజధాని అమరావతిలో భూములిచ్చిన రైతులకు (Amaravati Farmers) కౌలు చెల్లింపుపై హైకోర్టులో (AP Highcourt) విచారణ జరిగింది. రాజధాని పరిరక్షణ సమితి , రైతు సమాఖ్య పిటీషన్‌లపై హైకోర్టులో విచారణ జరుగగా.. రైతుల తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదనలు వినిపించారు. సీఆర్‌డీఏకి చట్టబద్దత లేదని, భూసమీకరణ ఒప్పందం నిబంధనలకు ఆమోదం లేదని కడపకు చెందిన వ్యక్తి ఇంప్లీడ్ పిటీషన్ దాఖలు చేశారు. ఎల్‌పీఎస్ నిబంధనలు శాసనసభ ఆమోదం పొందలేదని పిటీషనర్ పేర్కొన్నారు. రైతులకు కౌలు చెల్లించేందుకు వీలులేదని పేర్కొంటూ ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. ఇంప్లీడ్ పిటీషన్‌ను హైకోర్టు అనుమతించగా.. దీనిపై రైతుల తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ అభ్యంతరం తెలిపారు. తమ మధ్యంతర దరఖాస్తును పరిష్కరించాలని వాదనలు వినిపించారు. రాజధాని రైతుల కౌలు చెల్లింపుపై ప్రభుత్వం కౌంటర్ పిటీషన్ దాఖలు చేసింది. వాదనలు వినాలని కోర్టును న్యాయవాది మురళీధర్ అభ్యర్థించారు. దీంతో పండుగ సెలవుల తరువాత వింటామని హైకోర్టు విచారణను వాయిదా వేసింది.