AP News: మత్స్యకారుల అన్యాయాన్ని బయటపెట్టిన మాజీ మంత్రి
ABN , First Publish Date - 2023-05-16T20:25:34+05:30 IST
సీఎం జగన్, ఆయన తండ్రి మత్స్యకారులకు చేసిన అన్యాయం మాటల్లో చెప్పలేనిదని మాజీమంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: సీఎం జగన్, ఆయన తండ్రి మత్స్యకారులకు చేసిన అన్యాయం మాటల్లో చెప్పలేనిదని మాజీమంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా మత్స్యకారులుంటే, కేవలం లక్షమందికి అరకొర భృతి ఇస్తే వారిని ఆదుకున్నట్టా?, జగన్ (CM Jagan) సంవత్సరానికోసారి ఇచ్చే రూ.10వేలతో కుటుంబం బతికేస్తుందా?, టీడీపీ (TDP) హాయాంలో 17 వేల పడవలకు డీజిల్ సబ్సిడీ ఇస్తే, జగన్ 1100 పడవలేనని ఎలా చెబుతాడు? అని ఆయన ప్రశ్నించారు. మత్స్యకారులకు రూ.500 కోట్లు ఇచ్చానని జగన్ చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. జీవోనెం-217తో మత్స్యకారుల్ని రోడ్డునపడేసిన జగన్ వారిని ఉద్ధరిస్తున్నానని చెప్పడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు (Chandrababu) వేలాది మత్స్యకారులకు 75-90 శాతం సబ్సిడీతో వలలు, పడవలు, మరబోట్లు, ఐస్ బాక్సులు, ద్విచక్రవాహనాలు అందించారని గుర్తుచేశారు. జగన్ 4 ఏళ్లలో ఒక్కరికి ఒక్క పడవైనా ఇచ్చానని చెప్పగలడా? అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.