YCP 'Akarsh' TDP : టికెట్‌ మీది.. ఖర్చు మాది!

ABN , First Publish Date - 2023-05-05T03:35:30+05:30 IST

ఆయన ఉత్తరాంధ్రకు చెందిన చురుకైన, బలమైన టీడీపీ నాయకుడు! నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జి కూడా ఆయనే! ఆ నియోజకవర్గంలో ప్రస్తుతమున్న వైసీపీ ఎమ్మెల్యే ఖాయంగా ఓడిపోతారని సొంత సర్వేల్లో వస్తోంది.

YCP 'Akarsh' TDP : టికెట్‌ మీది.. ఖర్చు మాది!

వైసీపీలోకి వచ్చేయండి.. టీడీపీ నేతలపై ‘ఆకర్ష్‌’ వల

ఐప్యాక్‌ ప్రతినిధుల రాయబారాలు

సీట్ల కోసం వైసీపీ నానాపాట్లు

మునిగిపోయే పార్టీలోకి ఎందుకొస్తాం!

ముఖాన్నే చెబుతున్న టీడీపీ నేతలు

ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా

దుష్ట వ్యూహాలతో అధికారంలోకి వచ్చి... అనతికాలంలోనే ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుని... మళ్లీ ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ మరో వ్యూహానికి తెరలేపింది. అదే... ‘ఆకర్ష్‌’! తమ సిటింగ్‌ ఎమ్మెల్యే గెలవలేని, ప్రత్యామ్నాయం లేని స్థానాల్లో... అక్కడి టీడీపీ నేతలపై వల వేయడమే ఆ వ్యూహం! వైసీపీ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఐప్యాక్‌ ప్రతినిధులే దూతలు! ‘‘మేం అధికారంలోకి రావడం ఖాయం. ఎమ్మెల్యేగా మా గెలుపు ఖాయం. పరిస్థితి మాకు అనుకూలంగా ఉండగా... మునిగిపోయే పడవలాంటి వైసీపీలోకి ఎందుకొస్తాం!’’ అని సదరు టీడీపీ నేతలు ఐప్యాక్‌ రాయబారుల ముఖాన్నే చెప్పినట్లు సమాచారం!

(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఆయన ఉత్తరాంధ్రకు చెందిన చురుకైన, బలమైన టీడీపీ నాయకుడు! నియోజకవర్గానికి పార్టీ ఇన్‌చార్జి కూడా ఆయనే! ఆ నియోజకవర్గంలో ప్రస్తుతమున్న వైసీపీ ఎమ్మెల్యే ఖాయంగా ఓడిపోతారని సొంత సర్వేల్లో వస్తోంది. అక్కడ ఆ పార్టీకి మరో బలమైన నేత దొరకడం లేదు. అంతే... ఐప్యాక్‌ దూత రంగంలోకి దిగాడు. టీడీపీ నేతను కలిశాడు. ‘‘మీరు వైసీపీలోకి వచ్చేయండి. టికెట్‌ మీకే ఇస్తాం. సిటింగ్‌ ఎమ్మెల్యేను పక్కన పెడతాం. ఎన్నికల్లో మీరు పైసా కూడా జేబు నుంచి తీయక్కర్లేదు. మొత్తం ఖర్చు మాదే. రాజకీయంగా మీకు భవిష్యత్తు బాగుంటుంది’’ అంటూ ఐప్యాక్‌ దూత రకరకాల ఆఫర్లు ఇచ్చాడు. సదరు నేత వీటన్నింటినీ తోసిపుచ్చాడు. ‘‘మా పార్టీలో నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు. ఎన్నికల్లో మేమే గెలుస్తున్నాం. వైసీపీలోకి రావాల్సిన అవసరం లేనేలేదు’’ అని తేల్చి చెప్పారు. ఆ తర్వాత మళ్లీ ఒకటి రెండుసార్లు ఆ దూత సదరు నేతను కలవడానికి ప్రయత్నించినా... అందుకు ఆ టీడీపీ నాయకుడు అవకాశమివ్వలేదు. ఇక... రాయలసీమలోనూ ఒక నేతకు ఇదే ‘ఆఫర్‌’ వచ్చింది. ఆయన టీడీపీ మాజీ ఎమ్మెల్యే. ఆ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే పరిస్థితి ఏమాత్రం బాగలేదు. దీంతో... ఇక్కడా ఐప్యాక్‌ దూత రంగంలోకిదిగాడు. ‘‘మా పార్టీలోకి వచ్చేయండి. అయితే... టికెట్‌ మీకు ఇవ్వడం బాగుండదు. మీ సతీమణికి ఇస్తాం. మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసు. ఎన్నికల ఖర్చు భారం మీపై పడకుండా చూస్తాం’’ అని కోరాడు. ఆ నాయకుడు ఈ ఆఫర్‌ను తిరస్కరించారు. సొంత పార్టీలో ఎమ్మెల్యే అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంటే వైసీపీలోకి ఎందుకు రావాలని ప్రశ్నించారు. ఆ నేత తర్వాత టీడీపీ యువ నేత లోకేశ్‌ పాదయాత్రను తన నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. దీంతో ఐప్యాక్‌ దూతలు ఇక ఆయనను కలవడం మానేశారు.

సీట్ల కోసం పాట్లు...

ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఏమీ బాగలేదు. పాత పథకాలకు పేర్లుమార్చి, తీరు మార్చి అమలు చేయడం మినహా జగన్‌ కొత్తగా అమలు చేస్తున్న సంక్షేమం ఏమీ లేదని ప్రజలకు అర్థమైపోయింది. మరోవైపు... అభివృద్ధి జాడలేకుండా పోయింది. ఎమ్మెల్యేలపైనా జనంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వైసీపీ సొంత సర్వేల్లో ‘భవిష్యత్‌ చిత్రం’ కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీలో ఖాయంగా గెలుస్తారని అనుకొంటున్న నేతలను చేర్చుకునే వ్యూహానికి ‘ఐప్యాక్‌’ తెరలేపింది. వైసీపీలో చేరాలని, టికెట్‌ ఇస్తామని, ఖర్చు భరిస్తామని, తేడా వస్తే భవిష్యత్తులో ఏదోఒక అవకాశమిస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. కానీ... వారి ప్రయత్నాలకు స్పందన కనిపించడం లేదు. అయినా ఆశ చావక కొత్త నేతల కోసం వెతుకుతూనే ఉన్నారు.

వీరే టార్గెట్‌...

వైసీపీ అంతర్గత విశ్లేషణలో బాగా బలహీనంగా ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు. సొంత పార్టీలో సరైన ప్రత్యామ్నాయం కనిపించకపోతే టీడీపీ నేతలపై దృష్టి పెడుతున్నారు. అందులోనూ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారిని టార్గెట్‌ చేస్తున్నారు. తమ పార్టీ నేతల ద్వారా ప్రయత్నిస్తే ఆ సమాచారం బయటకు పొక్కుతుంది. ‘తన ప్రత్యర్థి వద్దకు రాయబారాలు వెళ్తున్నాయని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు తెలిస్తే వారిలో కొందరు ఇప్పుడే తిరుగుబాటు జెండా ఎగరవేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే వైసీపీలో ముసలం పుట్టిందనే ప్రచారం జరుగుతుంది. లేనిపోని సమస్యలు కొనితెచ్చుకోవడం ఇష్టంలేక ఐప్యాక్‌ దూతలతో రాయబారాలు నడిపిస్తున్నారు’’ అని ఒక రాజకీయ ప్రముఖుడు చెప్పారు. ‘టికెట్‌ మీది. ఖర్చు మాది’ అని ఓపెన్‌ ఆఫర్‌ ఇస్తున్నా టీడీపీ నేతల నుంచి పెద్దగా స్పందన లేకపోవడం, ముఖాన్నే ‘నో’ చెబుతుండటం వైసీపీ ముఖ్యులను ఆశ్చర్యపరుస్తున్నట్లు సమాచారం. ‘టీడీపీ నేతల్లో వారి పార్టీ గెలుపుపై చాలా బలమైన నమ్మకం నెలకొంది. అందుకే మేం ఆశించిన స్పందన రావడం లేదు’ అని వైసీపీ నేత ఒకరు అన్నారు.

‘ఐప్యాక్‌’దే హవా...

ఐప్యాక్‌ ప్రధాన నిర్వాహకుడు ప్రశాంత్‌ కిశోర్‌ తన టీంను నాలుగైదు బృందాలుగా విభజించారు. వాటి ద్వారా వివిధ పార్టీలకు వ్యూహాలు అందిస్తున్నారు. వైసీపీ కోసం పనిచేస్తున్న బృందానికి రిషి అనే వ్యక్తి నాయకత్వం వహిస్తున్నారు. వైసీపీ అధినాయకత్వం ఇటీవలి కాలంలో సొంత పార్టీ నేతలకంటే ఐ ప్యాక్‌ బృందంపైనే ఎక్కువ ఆధారపడుతోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే... పార్టీ అభ్యర్థులుగా ఎవరు ఉండాలి, ఎవరికి టికెట్‌ ఇవ్వాలి, ఎవరూ అందుబాటులో లేకుంటే... టీడీపీలో బలమైన నాయకులకు వల వేయడమెలా అనే వ్యూహం అమలు చేస్తున్నారు.

Updated Date - 2023-05-05T04:18:03+05:30 IST