AP News : ఇవేం దారుణాలురా బాబోయ్.. వింటేనే భయం వేస్తోంది..
ABN , First Publish Date - 2023-06-06T11:52:27+05:30 IST
నిజానికి ఇటీవలి కాలంలో నేరాలు దారుణంగా పెరిగిపోతున్నాయి.
విజయవాడ : నిజానికి ఇటీవలి కాలంలో నేరాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. హత్యకు పెద్దగా కారణం కూడా అవసరం లేదు. దారుణాతి దారుణంగా హతమారుస్తున్నారు. నేడు ఏపీలో రెండు చోట్ల దారుణ హత్యలు జరిగాయి. ఇవి చాలవన్నట్టు సొంత మనవరాలిని తీసుకెళ్లి రైలు పట్టాలపై పడుకోబెట్టాడో ప్రబుద్ధుడు. స్థానికులు చూశారు కాబట్టి సరిపోయింది లేదంటే.. మరో దారుణం జరిగిపోయి ఉండేది. మొత్తానికి ఈ దారుణాలన్నీ వింటుంటేనే వెన్నులో నుంచి వణుకు పుడుతోంది.
నేడు కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం లక్ష్మీపురం నెహ్రూ నగర్లో దారుణం చోటు చేసుకుంది. చిగురుపల్లి వినయ్ (23) అనే యువకుని దారుణంగా పీక కోసి హత్య చేశారు. లక్ష్మీపురం నుంచి పుచ్చగడ్డ రోడ్డులో వేప చెట్టు కింద వినయ్ రక్తపు మడుగులో పడిఉంటడాన్ని స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సోమవారం రాత్రి అమ్మమ్మ ఇంటి వద్ద పడుకునేందుకని తన ఇంటి నుంచి వినయ్ వెళ్లాడు. ఇక ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ రక్తపు మడుగులో విగతజీవిగా స్థానికులకు కనిపించాడు. చల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లా వి.కోట మండలం కే. గొల్లపల్లిలో దారుణ హత్య జరిగింది. ఆస్తి విషయమై దాయాదుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే సుదర్శన్ అనే వ్యక్తిని బాలాజీ హతమార్చాడు. ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో మద్యం మత్తులో ఓ వృద్ధుడు 8 సంవత్సరాల వయసున్న తన మనవరాలిని రైలు పట్టాలపై పడుకోబెడుతుండగా స్థానికులు అడ్డుకున్నారు. నిడదవోలు నుంచి గుడివాడకు తన మనవరాలితో ట్రైన్లో వెళుతూ మద్యం మత్తులో వృద్ధుడు ఆకివీడులో దిగిపోయాడు. దుంపగడప రైల్వే గేట్ వద్ద మనవరాలని పట్టాలపై పడుకోబెడుతుండగా బాలిక కేకలు వేయడంతో స్థానికులు వృద్ధుడిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు.