Chandrababu: జగన్ పాలనపై చంద్రబాబు విమర్శలు
ABN , First Publish Date - 2023-02-09T17:19:44+05:30 IST
సీఎం జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) విమర్శలు గుప్పించారు. ‘‘ఏపీ రాజధానిపై నిన్న సుప్రీంకోర్టు (Supreme Court)లో కేంద్రం అఫిడవిట్ వేసింది.
అమరావతి: సీఎం జగన్ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) విమర్శలు గుప్పించారు. ‘‘ఏపీ రాజధానిపై నిన్న సుప్రీంకోర్టు (Supreme Court)లో కేంద్రం అఫిడవిట్ వేసింది. శివరామకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం సుప్రీంకోర్టులో ప్రస్తావించింది. శివరామకృష్ణ కమిటీ నివేదికను రాష్ట్రానికి పంపామని తెలిపింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతి (Amaravati)ని రాజధానిగా ఎంపిక చేసిందని కేంద్రం తెలిపింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము ఆమోదించామని కేంద్రం చెప్పింది. రాజధానిగా అమరావతిని మెజార్టీ ప్రజలు ఆమోదించారు. ఏపీ ప్రభుత్వం (AP Govt) తమను సంప్రదించకుండానే 3 రాజధానుల చట్టం తెచ్చిందని.. కేంద్రం అఫిడవిట్లో స్పష్టంగా తెలిపింది. ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy) ప్రశ్నకు సమాధానంగానే కేంద్రం ఈ విషయాలు చెప్పింది’’ అని చంద్రబాబు గుర్తుచేశారు.
చట్టంలో లేని అధికారాన్ని జగన్ (Jagan) తన చేతుల్లోకి తీసుకున్నారని దుయ్యబట్టారు. జగన్ చేసే విధ్వంసాలను సరిదిద్దడం.. రాజ్యాంగ సంస్థలకు కూడా కష్టంగా మారిందన్నారు. చట్టానికి వ్యతిరేకంగా జగన్ పనిచేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి ఏర్పాటు రహస్యంగా చేసింది కాదని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చర్చలు జరిపామని తెలిపారు. ప్రధాని మోదీ వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారని, అమరావతికి అండగా ఉంటానని ప్రధాని చెప్పారని గుర్తుచేశారు. అమరావతిపై జగన్ మాట మార్చారని దుయ్యబట్టారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తుందేంటి? అని చంద్రబాబు ప్రశ్నించారు. విభజన చట్టం సెక్షన్ 5లో రాజధానిపై స్పష్టంగా ఉన్నా.. 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
జగన్ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుంది
‘‘జగన్ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుంది. చట్టాలు చేసే హక్కు శాసనసభకు లేదా అంటూ వక్రీకరించి మాట్లాడారు. కౌన్సిల్ రద్దు చేయడానికి అసెంబ్లీలో బిల్లు పెట్టారు. రాజధానికి రైతులు స్వచ్ఛందంగా వేలాది ఎకరాల భూమి ఇచ్చారు. వెయ్యి రోజులకుపైగా అమరావతి రైతులు పోరాడుతున్నారు. న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్రను ఇబ్బంది పెట్టారు. అమరావతిపై కులం పేరుతో విషం చిమ్మారు. అమరావతిని దెబ్బతీసేందుకు ఏజెన్సీలతో సర్వే చేయించారు. రాజధాని పూర్తయి ఉంటే లక్షల కోట్ల ఆదాయం వచ్చేది. మీ పైరవీల కోసం ముగ్గురు ఎంపీలను వాడుకున్నారు. మొత్తం రాష్ట్రాన్నే నాశనం చేసే పరిస్థితికి వచ్చారు’’ అని చంద్రబాబు విమర్శించారు.