TarakaRatna : అత్యంత విషమంగానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి.. ఆస్పత్రికి చేరుకున్న చంద్రబాబు.. కాసేపట్లో ఎన్టీఆర్ కూడా..
ABN , First Publish Date - 2023-01-28T19:27:18+05:30 IST
సినీ నటుడు నందమూరి తారకరత్న (Tarakaratna) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే (Highly Critical) ఉంది..
సినీ నటుడు నందమూరి తారకరత్న (Tarakaratna) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే (Highly Critical) ఉంది. బెంగళూరులోని నారాయణ హృదయాలయ (Narayana hrudayalaya) ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడట్లేదని.. మరికొన్ని రోజులు వైద్యం చేయాల్సి ఉందని డాక్టర్లు (Doctors) చెబుతున్నారు. గుండెనాళాల్లోకి రక్తప్రసరణ కాకపోవడంతో బెలూన్ యాంజియోప్లాస్టీ (Angioplasty) ద్వారా పంపింగ్ చేసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెసివిస్ట్‌లు, ఇతర స్పెషలిస్టులు తారకరత్న ఆరోగ్యాన్ని ఎప్పుటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతో అటు నందమూరి.. ఇటు నారా కుటుంబ సభ్యులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.
బెంగళూరు చేరుకున్న బాబు.. కాసేపట్లో ఎన్టీఆర్ కూడా..!
తారకరత్నకు గుండెపోటు వచ్చినప్పటి నుంచీ.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu) వైద్యులు, కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడి ఆరాతీస్తున్నారు. శనివారం సాయంత్రం 5.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన చంద్రబాబు.. బెంగళూరుకు చేరుకున్నారు. వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడి తారకరత్న ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. శుక్రవారం అర్ధరాత్రి కుప్పం నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించగా.. ఆయన వెంట ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఉన్నారు. తారకరత్న భార్య, కుమార్తెలు రాత్రి నుంచి ఆస్పత్రిలోనే ఉన్నారు. ఇవాళ పురంధేశ్వరి (Daggubati Purandeswari) కూడా ఆస్పత్రికి వెళ్లారు. మరోవైపు.. టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr) కూడా కాసేపట్లో ఆస్పత్రికి చేరుకోనున్నారు.
హెల్త్ బులిటెన్‌లో ఇలా..
ఇప్పటికే.. మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ (Myocardial Infarction) తర్వాత కార్డియోజెనిక్ షాక్ కారణంగా ఆయన పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని వైద్యులు హెల్త్ బులిటెన్‌లో తెలిపారు. ఎక్మో వైద్య విధానం (Ecmo Treatment) ద్వారా తారకరత్నకు కృతిమంగా శ్వాసనందిస్తున్నట్లు తెలిసింది. నందమూరి బాలకృష్ణ హాస్పిటల్లో ఉండి కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు.
అసలేం జరిగింది..!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొనడానికి కుప్పం వెళ్లిన సినీనటుడు నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. కుప్పం పట్టణం లక్ష్మీపురంలోని మసీదులో శుక్రవారం జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో లోకేశ్, నందమూరి బాలకృష్ణ, తారకరత్న పాల్గొన్నారు. మిగిలినవారి కంటే కాస్త ముందుగా తారకరత్న మసీదు నుంచి బయటికి వచ్చేశారు. మసీదు బయట కాస్త దూరంలో ఒక్కసారిగా సొమ్మసిల్లి కింద పడిపోయారు. వెంటనే యువగళం బృందంలోని వలంటీర్లు ఆయన్ను కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్ మెడికల్ కాలేజీకి తరలించారు. అనంతరం శుక్రవారం అర్ధరాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి ప్రత్యేక వైద్య బృందంతో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు కుటుంబ సభ్యులు.