Chintakayala Vijay: సీఐడీ విచారణకు చింతకాయల విజయ్

ABN , First Publish Date - 2023-01-29T18:34:26+05:30 IST

సోమవారం ఏపీ సీఐడీ (AP CID) విచారణకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ (Chintakayala Vijay) హాజరుకానున్నారు.

Chintakayala Vijay: సీఐడీ విచారణకు చింతకాయల విజయ్

అమరావతి: సోమవారం ఏపీ సీఐడీ (AP CID) విచారణకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ (Chintakayala Vijay) హాజరుకానున్నారు. రేపు ఉదయం 10:30కి గుంటూరు సీఐడీ ఆఫీస్‌లో అధికారులు విచారించనున్నారు. ‘భారతీ పే’ యాప్ వ్యవహారంలో విజయ్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మొదట ఈ నెల 27న విచారణకు రావాలని సీఐడీ నోటీసులిచ్చింది. అయితే ఈనెల 27న తనకు వేరే కార్యక్రమాలు ఉండటంతో సీఐడీ విచారణకు హాజరుకాలేనని హైకోర్టు (High Court)లో చింతకాయల విజయ్ పిటిషన్ వేశారు. వాదనలు విన్న న్యాయస్థానం మంగళవారం సీఐడీ విచారణకు హాజరుకావాలంటూ విజయ్‌ని ఆదేశించింది. అలాగే లాయర్ సమక్షంలో సీఐడీ విచారించాలని కోర్టు ఆదేశాలిచ్చింది.

విజయ్‌కు మళ్లీ 41ఏ నోటీసు

చింతకాయల విజయ్‌కు సీఐడీ అధికారులు మరోసారి సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు జారీచేశారు. అనకాపల్లి జిల్లా (Anakapalli District) నర్సీపట్నం శివపురంలోని ఆయన ఇంటికి వచ్చి నోటీసులిచ్చారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో ఆయన తల్లి పద్మావతికి నోటీసు అందజేశారు. మంగళగిరి (Mangalagiri)లోని సీఐడీ కార్యాలయంలో నమోదైన కేసుకు సంబంధించి ఈ నెల 27న విజయ్‌ అక్కడ విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబరులో ‘భారతీ పే’ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీనికి ఐ-టీడీపీయే కారణమంటూ దానికి కో-కన్వీనర్‌గా ఉన్న విజయ్‌పై సీఐడీ కేసు నమోదుచేసింది. ఆయనకు 41ఏ నోటీసులివ్వడానికి సీఐడీ అధికారులు గతేడాది అక్టోబరు 1న హైదరాబాద్‌ (Hyderabad)లోని విజయ్‌ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను బెదిరించారన్న ఆరోపణలు వచ్చాయి. సీఐడీ అధికారుల తీరుపై విజయ్‌ భార్య డాక్టర్‌ సువర్ణకుమారి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ నేపథ్యంలో మరోసారి విజయ్‌కు 41ఏ ప్రకారం నోటీసులిచ్చారు.

Updated Date - 2023-01-29T18:34:27+05:30 IST