AP Governor Abdul Nazir: సంపద సృష్టించే శక్తి వెటర్నరీ వైద్యుల చేతుల్లోనే ఉంది
ABN , First Publish Date - 2023-07-22T15:22:21+05:30 IST
మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. హరప్పా నాగరికత కాలం నుంచి భారతదేశంలో పశు వైద్యంపై సమగ్రమైన జ్ఞానం ఉండేది. దేశానికి సంపదను సృష్టించే శక్తి వెటర్నరీ వైద్యులైన మీ చేతుల్లోనే ఉంది.
తిరుపతి: సక్సెస్ అనేది యాక్సిడెంటల్ కాదని.. కష్టపడటం, పోటీతత్వం, త్యాగం, చేసే పనిని ప్రేమించటం, నేర్చుకోవటం ఇలా నిరంతర ప్రక్రియ కావాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazir) విద్యార్థులకు సూచించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయ 12వ స్నాతకోత్సవంలో కులపతి హోదాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొని మాట్లాడారు. ‘‘మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. హరప్పా నాగరికత కాలం నుంచి భారతదేశంలో పశు వైద్యంపై సమగ్రమైన జ్ఞానం ఉండేది. దేశానికి సంపదను సృష్టించే శక్తి వెటర్నరీ వైద్యులైన మీ చేతుల్లోనే ఉంది. పశు ఆధారిత ప్రకృతి వ్యవసాయం వల్ల ఆరోగ్యం, కాలుష్య రహిత ఆహారం సాధ్యం. ఆనాదిగా పశువుల నుంచి సేకరించే పాలు, నెయ్యి వంటి వాటితో చేసే పంచగవ్య వైద్యం విలువను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. కలలు కనే ధైర్యం ఉండాలి. వ్యూహాత్మమైన సహనం అందుకు తోడు కావాలి. లేవండి.. మీ లక్ష్యం సాధించే వరకు ఆగకండి అనే వివేకానందుడి మాటలను నిత్యం గుర్తు పెట్టుకోండి.’’ అని విద్యార్థులు గవర్నర్ హితబోధ చేశారు.