Pulivendula Firing: పులివెందుల కాల్పుల్లో గాయపడిన మస్తాన్‌కు చిత్తూరులో చికిత్స
ABN , First Publish Date - 2023-03-29T12:16:26+05:30 IST
పులివెందులలో నిన్న జరిగిన కాల్పుల ఘటనలో కాల్పులకు గురైన మహబూబ్ బాషా అలియాస్ మస్తాన్ బాషా చిత్తూరులోని బాబు నర్సింగ్ హోంలో చికిత్స జరుగుతోంది.
చిత్తూరు: పులివెందుల (Pulivendula Firing)లో నిన్న జరిగిన కాల్పుల ఘటనలో కాల్పులకు గురైన మహబూబ్ బాషా అలియాస్ మస్తాన్ బాషా చిత్తూరు (Chittoor) లోని బాబు నర్సింగ్ హోంలో చికిత్స జరుగుతోంది. భాషా బుల్లెట్ గాయాలపై వైద్యులు స్కాన్ తీసి పరిశీలించారు. ఎడమ మోచేతి క్రింది భాగంలో బుల్లెట్ రవ్వలు చెల్లాచెదురైనట్లు గుర్తించారు. అలాగే ఎడమ తొడ ఎముక, తొడకండరాల్లోనూ బుల్లెట్ రవ్వలు చెల్లా చెదురైనట్లు వైద్యులు తెలిపారు. చేతిలో మాత్రం ఒక బుల్లెట్ దూరి బయటకు వచ్చింది. మేజర్ ఇష్యూ కాబట్టి రవ్వలు శరీరం నుంచి బయటికి తీయాలంటే బాధితులు అంగీకరిస్తేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని... శరీరంలో ఎముకలు బాగా దెబ్బతిన్నాయని వైద్యులు చెబుతున్నారు.
కడప జిల్లా పులివెందులలో మంగళవారం కాల్పుల ఘటన కలకలం రేపింది. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి (YCP MP Avinash Reddy) అనుచరుడు భరత్ కుమార్ యాదవ్ జరిపిన కాల్పుల్లో ఒకరు మృత్యువాతపడ్డారు. మరొకరికి తూటా గాయాలయ్యాయి. జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-2 సునీల్‌కుమార్ యాదవ్‌కు భరత్ స్నేహితుడు, ఏ-5 దేవిరెడ్డి శంకర్‌రెడ్డికి ముఖ్య అనుచరుడు. పులివెందుల పట్ణణంలో నగరిగుట్టకు చెందిన గొర్ల భరత్‌కుమార్ యాదవ్, చింతకుంట దిలీప్ కుమార్, రాగిపాటి మహబూబ్‌బాషా ఆలియాస్ యాక్షన్‌బాషాల మధ్య కొంత కాలంగా ఆర్థిక లావాదేవీల వివాదం జరుగుతోందని స్థానికులు అంటున్నారు. ఇవన్నీ కూడా మట్కా, గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన లావాదేవీలే. ఈ నేపథ్యంలో భరత్‌కుమార్ యాదవ్.... డబ్బుల విషయమై మంగళవారం మధ్యాహ్నం దిలీప్‌కుమార్, యాక్షన్ బాషాతో గొడవపడ్డాడు. మాటా మాటా పెరిగి ఆగ్రహానికి గురైన భరత్‌కుమార్ యాదవ్ హుటాహుటిన తన ఇంట్లోకి వెళ్లి తుపాకి తీసుకువచ్చారు. దిలీప్, బాషాలపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ దిలీ్‌పకుమార్ గుండె కింద భాగాన దిగింది. బాషాకు చేయి, కాలి పిక్కకు రెండు బుల్లెట్లు తగిలాయి. చికిత్స కోసం దిలీ్‌పకుమార్‌ను వేంపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందాడు. బాషాను పులివెందుల ఏరియా ఆస్పత్రిలో చికిత్స అనంతరం కడప రిమ్స్ తరలించారు.