Tomato Farmer: బంగారం పండించినా ఇంత సంపాదించలేరేమో.. చిత్తూరు జిల్లా రైతా.. మజాకా..!
ABN , First Publish Date - 2023-07-29T18:02:37+05:30 IST
కోట్లు సంపాదించిన టమోటా రైతుగా చిత్తూరు జిల్లా సోమల మండలానికి చెందిన చంద్రమౌళి వార్తల్లో నిలిచాడు. మండలంలోని కరకమంద గ్రామానికి చెందిన ఈయన టమోటా పంట సాగు చేసి 45 రోజుల్లో రూ.4 కోట్లు సంపాదించి ఔరా అనిపించాడు. నెల రోజుల్లో రూ.3 కోట్లు సంపాదించిన రైతుగా చంద్రమౌళి ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.
కూరగాయల్లో టమోటా తీరే వేరు. గతంతో చాలామంది రైతులకు టమోటా పంట చేదు అనుభవం మిగిల్చింది. సరైన గిట్టుబాటు ధరలు లేక రోడ్లపై పారబోయడం వటి ఘటనలు చోటుచేసుకున్నాయి. టమోటా కోసి మార్కెట్‌కు తరలించే ఖర్చు కూడా లభించక పొలాల్లోనే చాలా మంది రైతులు వదిలేశారు. కనీసం కూలి ఖర్చులూ రాకపోవడంతో రైతులు కాయలు కోయకుండా పొలాల్లోనే వదిలేశారు. తోటలనూ ఎండబెట్టేశారు. పశువులకు మేతగా మార్చేశారు. కానీ.. ఇదంతా టమోటా రైతు గతంలో ఎదుర్కొన్న చేదు అనుభవం. కానీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమోటా రైతు దశ తిరిగింది. డబుల్ సెంచరీ దిశగా టమోటా ధర దూసుకెళుతోంది. దీంతో.. టమోటా పంట పండించిన రైతులు లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. టమోటా రైతులకు మంచి రోజులొచ్చాయనే చెప్పాలి.
తాజాగా.. అలా కోట్లు సంపాదించిన టమోటా రైతుగా చిత్తూరు జిల్లా సోమల మండలానికి చెందిన చంద్రమౌళి వార్తల్లో నిలిచాడు. మండలంలోని కరకమంద గ్రామానికి చెందిన ఈయన టమోటా పంట సాగు చేసి 45 రోజుల్లో రూ.4 కోట్లు సంపాదించి ఔరా అనిపించాడు. ఏప్రిల్‌లో చంద్రమౌళి 22 ఎకరాల్లో టమాటా పంట సాగు చేశాడు. ఇటీవల పంట చేతికొచ్చింది. సరిగ్గా అదే సమయానికి టమోటాకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇంకేముంది.. చంద్రమౌళి పంట పండింది. ఒక్క నెలలోనే 40 వేల టమోటా బాక్సులను విక్రయించి రూ.3 కోట్ల నికర లాభం ఆర్జించాడు. నెల రోజుల్లో రూ.3 కోట్లు సంపాదించిన రైతుగా చంద్రమౌళి ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.
ఒక్క.. చంద్రమౌళినే కాదు.. ఇటీవల మెదక్ జిల్లాకు చెందిన చెందిన ఒక రైతు టమాటా పంట సాగు చేసి కోటి రూపాయలకు పైగా ఆదాయం పొందాడు. కోటి రూపాయలకు పైగా టమాటా పంట సాగుచేయడంతో సీఎం కేసీఆర్ స్వయంగా సచివాలయానికి పిలిచి సన్మానం చేసిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్‌కు చెందిన మహిపాల్‌రెడ్డి అనే రైతు ఈ ఘనత సాధించారు. తనకున్న పొలంతో పాటు ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని మహిపాల్‌రెడ్డి కూరగాయలు సాగు చేస్తుంటారు. ఈసారి ఎనిమిది ఎకరాల్లో టమాట వేశారు. అయితే, పంట చేతికొచ్చే సమయానికి టమాటాకు మునుపెన్నడూ లేని ధర పలుకుతుండటంతో మహిపాల్ రెడ్డిని లక్ష్మీదేవీ కరుణించింది. ఎనిమిది వేల బాక్సుల(ఒక్కో బాక్సు 25 కిలోలు) టమాటాలు విక్రయించగా మహిపాల్‌రెడ్డికి రూ.కోటీ 84 లక్షలు వచ్చాయి. ఇంకా రూ.కోటి విలువ చేసే టమాట ఆయన వద్ద ఉంది. అయితే, వచ్చిన ఆదాయంలో రూ.50లక్షల వరకు పెట్టుబడి ఖర్చులకు వెళ్తుందని మహిపాల్ రెడ్డి తెలిపారు.
ఈ నెల 5న హైదరాబాద్‌లోని బోయినపల్లి మార్కెట్‌కు మహిపాల్‌రెడ్డి 550 టమాట బాక్సులు తీసుకెళ్లగా ఒక్కో బాక్సు రూ.2,300 నుంచి రూ.2,500 చొప్పున పలికింది. దీంతో ఒక్కరోజే మహిపాల్‌రెడ్డికి రూ.13.75లక్షలు వచ్చాయి. ఇదిలా ఉండగా.. టమోటా రైతులకు దొంగల బెడద ఎక్కువైంది. దీంతో పలువురు రైతులు తోటల వద్ద కాపలా కాయాల్సిన పరిస్ధితి నెలకొంది. రాత్రి వేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు తోటల్లో చొరబడి కాయలు కోసుకెళ్తుండడంతో రాత్రి 11 గంటల వరకు కాపలా ఉండి మళ్ళీ ఉదయం 5 గంటలకే వెళ్తున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా టమోటా తోటలకు కాపలా కాయాల్సిన పరిస్ధితి నెలకొంది.