Chandrababu News: చంద్రబాబు రెండో రోజు విచారణ.. తాజా అప్‌డేట్ ఇదే...

ABN , First Publish Date - 2023-09-24T09:47:24+05:30 IST

స్కిల్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని రెండో రోజు ప్రశ్నించేందుకు సీఐడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. సీఐడీ అధికారుల బృందం రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకున్నారు. కోర్ట్ ఆదేశాల ప్రకారం విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

Chandrababu News: చంద్రబాబు రెండో రోజు విచారణ.. తాజా అప్‌డేట్ ఇదే...

రాజమండ్రి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి రెండో రోజు సీఐడీ విచారణ మొదలైంది. మొదటి రోజు మాదిరిగానే ప్రశ్నించేందుకు సీఐడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలుత సీఐడీ అధికారుల బృందం రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకుంది. కోర్ట్ ఆదేశాల ప్రకారం విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాలులో చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. చంద్రబాబు తరపున ఇద్దరు న్యాయవాదులు విచారణలో పాల్గొన్నారు. ఇదిలావుండగా నేటితో చంద్రబాబు సీఐడీ కస్టడీ ముగియనుంది. సాయంత్రం విచారణ అనంతరం అధికారులు వర్చువల్‌గా జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు.


ఇదిలావుండగా చంద్రబాబు రెండో రోజు విచారణ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలు ఆవరణలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. చుట్టుపక్కల పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. చంద్రబాబుకు సంఘీభావంగా ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకున్న నేపథ్యంలో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు.


మొదటి రోజు సూటిగా జవాబులు

మొదటి రోజు సీఐడీ విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పారు. ‘స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టులో ఏ స్కామూ లేదు. రాష్ట్ర యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు పెంచేందుకే దీనిని అమలు చేశాం’ అని సీఐడీకి మరోసారి స్పష్టం చేసినట్లు తెలిసింది. రెండు రోజుల సీఐడీ కస్టడీలో భాగంగా శనివారం రాజమహేంద్రవరం కారాగారంలో సీఐడీ అధికారులు ఆయనను సుదీర్ఘంగా ప్రశ్నించారు. డీఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో తొమ్మిది మంది సీఐడీ అధికారులు... ఒక తహసీల్దార్‌, మరో మధ్యవర్తి సమక్షంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. కొన్ని ఫైళ్ల నకళ్లు ఆయన ముందుంచి వాటి గురించి ఆరా తీసినట్లు సమాచారం. సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు సూటిగా, స్పష్టంగా సమాధానమిచ్చినట్లు తెలిసింది. చంద్రబాబును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపే రోజే సీఐడీ అధికారులు దాదాపు 9 గంటలపాటు ‘సిట్‌’ కార్యాలయంలో ప్రశ్నించారు. శనివారం కూడా అవే అంశాలపై ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.

Updated Date - 2023-09-24T10:07:24+05:30 IST