AP Sarpanch: జంతర్‌మంతర్‌లో ఏపీ సర్పంచ్‌ల ఆందోళన.. మద్దతు తెలిపిన ఎంపీ రఘురామ
ABN , First Publish Date - 2023-08-05T13:11:13+05:30 IST
దేశరాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వీరి నిరసనకు ఎంపీ రఘురామ కృష్ణరాజు (MP Raghuram Krishna Raju) మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... పంచాయతీరాజ్ వ్యవస్థను వెన్ను విరిచే పనిలో జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan mohan Redyy) ఉన్నారని విమర్శించారు. కరెంట్ బిల్లుల పేరుతో పంచాయతీ నిధులను లాక్కున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దురదృష్టవశాత్తు తమ పార్టీకే 70% సర్పంచులు విజయం సాధించారన్నారు. ఇప్పుడు వారి గొంతులు సహితం ప్రభుత్వం కోస్తోందని తెలిపారు. వైసీపీ పార్టీలో నెగ్గిన సర్పంచులు కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కోక తప్పడం లేదన్నారు. పంచాయతీలో పనులు చేసిన సర్పంచ్లు ఎవరికి కూడా నిధులు రావడం లేదన్నారు.
పంచాయితీ రాజ్ నిధులు దాదాపు రూ.8629 కోట్లను ప్రభుత్వం (AP Government) దోచేసిందని మండిపడ్డారు. పంచాయతీ వ్యవస్థలను నిర్వీర్యం చేసే విధంగా వలంటీరీ వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో వలంటీరీల దాడులు జరుగుతూనే ఉన్నాయని తెలిపారు. సర్పంచ్ అనే పదానికి విలువ లేకుండా వలంటీరీ అనే వ్యవస్థను జగన్ తీసుకొచ్చారని విమర్శించారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. పుంగనూరులో చంద్రబాబు నాయుడపై చేసిన దాడి చాలా క్లియర్‌గా కనిపిస్తోందన్నారు. కనీసం పోలీసులు ఘర్షణను ఆపే ప్రయత్నం కూడా చేయలేదని రఘురామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.