Devineni Uma : అవినాష్ రెడ్డి బినామీ కంపెనీ వద్ద ట్రాన్స్‌ఫార్మర్ అంత పెట్టి ఎందుకు కొంటున్నారు?
ABN , First Publish Date - 2023-05-20T13:53:29+05:30 IST
కోతల్లేని కరెంటును ఇవ్వాలి .. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ నిరసనకు దిగారు. సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘కోతల్లేని కరెంటు రాష్ట్రంలో ఇదివరికెన్నడు లేనంతగా పెరిగిన వినియోగం’ కాపీ ప్రతులను మాజీ మంత్రి దేవినేని, పార్టీ శ్రేణులు చింపివేశారు.
ఎన్టీఆర్ జిల్లా : కోతల్లేని కరెంటును ఇవ్వాలి .. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ నిరసనకు దిగారు. సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘కోతల్లేని కరెంటు రాష్ట్రంలో ఇదివరికెన్నడు లేనంతగా పెరిగిన వినియోగం’ కాపీ ప్రతులను మాజీ మంత్రి దేవినేని, పార్టీ శ్రేణులు చింపివేశారు. ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ.. జగన్ రెడ్డి లూఠీ, అవినీతి కారణంగా విద్యుత్ వినియోగదారులపై రూ.57,188 కోట్ల భారాలు మోపారన్నారు. క్విడ్ ప్రోకోలకు ప్రభుత్వ విద్యుత్ సంస్థల్లో వాటి సామర్థ్యం మేరకు ఎందుకు విద్యుత్ ఉత్పత్తి చేయడంలేదని దేవినేని ఉమ ప్రశ్నించారు.
‘‘అవినాష్ రెడ్డి బినామీ కంపెనీ షిర్డీ సాయి ఎలక్ట్రికల్ వద్ద రూ.60వేలు ధర ఉన్న ట్రాన్స్ ఫార్మర్ కు రూ.1.30 లక్షలకు ఎందుకు కొంటున్నారు? నాసిరకం పరికరాల వల్లే థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ బ్రేక్ డౌన్లు - సాంకేతిక లోపంగా కలరింగ్ ఇస్తున్నారు. కూకట్‌పల్లిలో 11 ఎకరాలు హిందుజా నుంచి కొట్టేసి క్విడ్ ప్రోకోగా వారికి 2,800 కోట్లు ఇస్తున్నారు. స్మార్ట్ మీటర్లలో రూ.18 వేలు విలువ గల దాన్ని రూ.30 వేలకు కొనుగోలు చూస్తూ ఖర్చు చేయబోయే రూ.31 వేల కోట్లలో రూ.12 వేల కోట్లు కమీషన్ కొట్టేస్తున్నారు. ఈ భారాలు విద్యుత్ వినియోగదారులపై వేస్తున్నారు. 73 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో 20 మంది ముఖ్యమంత్రులు 7 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తే.. టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కరే 15 వేల మెగావాట్లు ఉత్పత్తి చేశారు. దేశంలోనే మొదటిగా, ఆసియాలోనే అతిపెద్ద అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్లాంట్‌ను చంద్రబాబు కర్నూలులో స్థాపించారు. ఏపీ చరిత్రలో లోటును అధికమించి కోతలు లేని 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. జగన్ చేతిలో చంద్రన్న పెట్టిన విద్యుత్ ప్లాంట్లను సక్రమంగా నడుపుకుంటే ఈ సంక్షోభం ఉండేది కాదు’’ అని పేర్కొన్నారు.