Yuvagalam Padayatra: టీడీపీ ద్వారానే బీసీలకు ఆర్థిక, రాజకీయ చైతన్యం: లోకేశ్

ABN , First Publish Date - 2023-04-19T19:19:21+05:30 IST

బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పెద్దపీట వేసిన ఘనత ఎన్టీఆర్‌ (NTR) అయితే.... స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత చంద్రబాబు

Yuvagalam Padayatra: టీడీపీ ద్వారానే బీసీలకు ఆర్థిక, రాజకీయ చైతన్యం: లోకేశ్

కర్నూలు: బలహీనవర్గాల అభ్యున్నతి కోసం పెద్దపీట వేసిన ఘనత ఎన్టీఆర్‌ (NTR) అయితే.... స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత చంద్రబాబు (Chandrababu)ది అని యువనేత నారా లోకేష్‌ (Nara Lokesh) అన్నారు. యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)లో భాగంగా బుధవారం 75వ రోజు 15.5 కి.మీ.లు నడిచారు. ఇప్పటి దాకా పాదయాత్ర 976.8 కిలోమీటర్లకు చేరుకుంది. ఆలూరు నియోజకవర్గం (Aluru Constituency) టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ, తెలుగు యువత నాయకుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డిలతో కలిసి ఆస్పరి మండలం వలగొండ నుంచి నడక మొదలు పెట్టిన లోకేష్‌కు పల్లెపల్లెనా జనం నీరాజనం పట్టారు. వలగొండ, పుష్పాలదొడ్డి, కైరుప్పుల, కారుమంచి మీదుగా బయలుదేరి ములగుందంలో రాత్రి బస చేశారు. పల్లెకు వెళ్లినా రైతులు, కూలీలు, మహిళలు, యువత ఉప్పొంగిన కెరటంలా రోడ్ల పైకి వచ్చి లోకేశ్‌ను కలిశారు. తమ భవిష్యత్తు నాయకుడు మీరే.... గాడి తప్పిన పల్లె ప్రగతికి పునాది వేయాలని.... తాగు, సాగునీరు ఇవ్వాలని... పరిశ్రమలు తెచ్చి మా పిల్లలకు ఉపాధి చూపాలని... కరువు, వలసలు ఆపేలా చర్యలు చేపట్టాలని యువనేతకు విన్నవించారు. మండుతున్న ఎండల్లో కూడా ఎంతో ఓపికతో జనం సమస్యలు వింటూ.. రానున్నది చంద్రన్న రాజ్యం... మీ బాధలు, కష్టాలు తీర్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. పసుపు జెండాను గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలని వివరిస్తూ ముందుకు సాగారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో బీసీ సంఘాల ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించారు. వాళ్లు చెప్పిన వివిధ సమస్యలు విన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.

అరక పట్టి.... పొలం దున్ని

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం కారుమంచి శివారులో బోయ అర్జున్‌ అనే రైతు పొలం దున్నుతున్నాడు. ఆ సమయంలో పాదయాత్రగా అక్కడికి చేరుకున్న యువనేత లోకేశ్‌ నేరుగా పొలంలోకి వెళ్లాడు. రైతుతో కలిసి అరక (నాగలి) చేతపట్టి పొలం దున్నాడు. వ్యవసాయం లాభసాటిగా ఉందా..? అని రైతును అడిగగా.. లోకేష్‌ అన్నా తాము ముగ్గురు అన్నదమ్ములం... ఉమ్మడి కుటుంబం.. మాకున్నది 11 ఎకరాలు, గత ఏడాది మూడెకరాల్లో ఉల్లి వేస్తే వరద వచ్చి కొట్టుకుపోయి రూ.30 లక్షల నష్టం మిగిలింది. నాలుగు ఎకరాల్లో మిరప వేస్తే నాసిరకం విత్తనాలు వల్ల నట్టేట మునిగాము అంటూ ఏకరువు పెట్టాడు. నాలుగు ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తే ఎకరాకు మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. ఖర్చులు, కూలీలు పోను రూ.2.40 లక్షల నష్టం వచ్చిందని వాపోయారు. ప్రభుత్వాలు ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని చాలించడం తప్ప మరో మార్గం లేదని వివరించాడు. యువ నేత లోకేష్‌ మాట్లాడుతూ సీఎం జగన్‌ అనాలోచిత విధానాల వల్ల రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. టీడీపీ హాయంలో రాష్ట్రంలో రైతుల సగటు అప్పు రూ.70 వేలు ఉంటే... ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా రూ.2.5 లక్షలకు చేరిందని పేర్కొన్నారు. ఏడాదిలో టీడీపీ ప్రభుత్వం వస్తుంది. వ్యవసాయ లాభసాటిగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తున్నామని వివరించారు.

Updated Date - 2023-04-19T19:19:21+05:30 IST