ChintaMohan: జీఎస్టీ వసూళ్లలో అంతా అవినీతే.. ఆ డబ్బంతా ఏం చేస్తున్నారు?
ABN , First Publish Date - 2023-10-27T10:54:51+05:30 IST
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానం తప్పుడు తడకలుగా సాగుతోందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ సేనలు ఆస్పత్రిపై బాంబులు వేస్తే ప్రధాని మోదీ సమర్థిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానం తప్పుడు తడకలుగా సాగుతోందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ (Former Union Minister Chinta Mohan) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ సేనలు ఆస్పత్రిపై బాంబులు వేస్తే ప్రధాని మోదీ (PM Modi) సమర్థిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మానవత్వం అయినా చూపరా అంటూ వ్యాఖ్యలు చేశారు. దేశంలో జీఎస్టీ విధానం అస్తవ్యస్తంగా ఉందన్నారు. దేశంలో మూడు వేల రకాల వస్తువులపై జీఎస్టీ పన్నులు వసూలు చేస్తున్నారని.. నెలకు 1.25 లక్షల కోట్లు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఈ డబ్బు అంతా కేంద్రం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఐదు రకాల స్లాబ్‌లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లలో అంతా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. మరమ్మతుల పైన కూడా జీఎస్టీ ఏమిటని నిలదీశారు. అసలు ప్రపంచంలో ఎక్కడా ఈ తరహా ట్యాక్స్ లేదన్నారు. జీఎస్టీ అంతా అవినీతిమయంగా మారిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో (YCP Government) ప్రజా స్వామ్యమే లేదన్నారు. మైక్ పర్మిషన్‌కు కూడా కాలుష్య ధృవీకరణ పత్రం ఏమిటని అడిగారు. ఏపీలోనీ విద్యా విధానం మార్పు చేయడం వల్ల ఎస్సీలు, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు. విద్యా విధానం మార్పు చేయడానికి ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ఏమైనా స్కాలరా అంటూ ఆయన మండిపడ్డారు.
ఏపీలో వైద్య సదుపాయాలు సరిగ్గా లేవని.. మద్యం తాగుతున్న వారి లివర్‌లు చెడిపోయాయన్నారు. ఉద్యోగాలు లేక యువత మద్యం దుకాణాల వద్ద తాగుతున్నారన్నారు. కల్తీ మద్యం సరఫరా చేస్తున్న ప్రభుత్వం దుర్మార్గంగా నడుస్తోందన్నారు. ఏపీలో అంతా ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. మార్గదర్శిపై కక్ష సాధింపు చర్యలు ఎందుకని అన్నారు. చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) అరెస్టును ఖండిస్తున్నామన్నారు. 14 ఏళ్ళు సీఎంగా పని చేసిన వ్యక్తిని, ప్రతిపక్ష నేతను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం, అర్ధరాత్రి తీర్పులు ఏమిటని అన్నారు. కోర్టుల్లోనూ రాజకీయ ప్రమేయం కనిపిస్తోందని వ్యాఖ్యలు చేశారు. 17ఏపై నిర్ణయం తీసుకోడానికి కోర్టులకు నెల రోజుల సమయం కావాలా అని ప్రశ్నించారు. నెల రోజులకు పైగా చంద్రబాబును జైల్లో పెట్టి ఏం సాధించారన్నారు. రాహుల్ గాంధీపైనా (Congress Leader Rahul Gandhi) బీజేపీ (BJP) రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారని.. కోర్టుల్లో రాజకీయ ప్రమేయం ఉందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చూడ్‌ను (Chief Justice of India Justice Chandra Choudh) చింతా మోహన్ కోరారు.