Sabari Express 17230: శబరి ఎక్స్‌ప్రెస్‌లో బెర్తుల బుకింగ్ ఇలా..
ABN , First Publish Date - 2023-08-28T15:26:26+05:30 IST
ఏ రోజుకి ఆ రోజు శబరి ఎక్స్‌ప్రెస్‌లో రిజర్వేషన్ కోటా టికెట్‌లు బుకింగ్ అయిపోతున్న దృష్ట్యా ప్రయాణాన్ని రెండు భాగాలుగా చేసుకుంటే సులభంగా టికెట్‌లు రిజర్వు అవుతాయని జెడ్‌ఆర్‌యూసీసీ మాజీ సభ్యుడు ఉప్పులూరి శశిధర్‌చౌదరి తెలిపారు.
గుంటూరు: ఏ రోజుకి ఆ రోజు శబరి ఎక్స్‌ప్రెస్‌లో రిజర్వేషన్ కోటా టికెట్‌లు బుకింగ్ అయిపోతున్న దృష్ట్యా ప్రయాణాన్ని రెండు భాగాలుగా చేసుకుంటే సులభంగా టికెట్‌లు రిజర్వు అవుతాయని జెడ్‌ఆర్‌యూసీసీ మాజీ సభ్యుడు ఉప్పులూరి శశిధర్‌చౌదరి తెలిపారు. నెంబర్.17230 సికింద్రాబాద్-తిరువనంతపురం శబరి ఎక్స్‌ప్రెస్‌కి స్లీపర్‌క్లాస్ బెర్తులను రైల్వే శాఖ సికింద్రాబాద్‌కి(406), గుంటూరుకు(88), తిరుపతికి(84), సేలం(54), కోయంబత్తూరు(128), కొట్టాయం(11) కేటాయించారు. సికింద్రాబాద్ నుంచి సత్తెనపల్లి వరకు జనరల్ కోటాగా పరిగణిస్తారు. గుంటూరు నుంచి రిమోట్ లొకేషన్, రోడ్‌సైడ్ కోటాలు ఉంటాయి.
ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి ప్రాంతాల యాత్రికులకు చెంగనూరు/తిరువనంతపురం వరకు బుకింగ్ చేసుకోవడానికి 86 బెర్తులు అందుబాటులో ఉంటాయి. అదే కొట్టాయం వరకు అయితే అదనంగా మరో 84 అందుబాటులో ఉంటాయి. కోయంబత్తూరుకు 39, సేలంకి 24, తిరుపతికి 67 ఉంటాయి. దీని దృష్ట్యా నేరుగా చెంగనూరు/తిరువనంతపురానికి స్లీపర్ క్లాస్ బెర్త్ టికెట్ దొరకకపోతే ఆయా ప్రయాణీకులు కోయంబత్తూరు/సేలం/తిరుపతికి బుకింగ్ చేసుకుని అక్కడి నుంచి చెంగనూరు/తిరువనంతపురానికి మరో టికెట్ బుకింగ్ చేసుకుంటే కన్‌ఫర్మ్ బెర్తులు దొరికే అవకాశం ఉంటుంది. దీని వలన టికెట్‌కు రూ.60 నుంచి 100 లోపే అదనపు చార్జి అవుతుంది.
గుంటూరు నుంచి చెంగనూరు/తిరువనంతపురానికి కేవలం నాలుగు బెర్తులే ఉన్నాయి. కొట్టాయంకు 26, కోయంబత్తూరుకు 23, సేలంకు 18, తిరుపతికి 17 ఉన్నాయి. ఈ నేపథ్యంలో గుంటూరు నుంచి బుకింగ్ చేసుకోదలిచిన ప్రయాణీకులు కూడా తిరుపతి/సేలం/కోయంబత్తూరుకు ఒక టికెట్, అక్కడి నుంచి చెంగనూరు/తిరువనంతపురానికి రెండో టికెట్ బుకింగ్ చేసుకుంటే కన్‌ఫర్మ్ ఛాన్స్ ఎక్కువగా ఉందటుందని చెప్పారు. ఏసీ త్రీటైర్ విషయానికి వస్తే నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి నుంచి నేరుగా చెంగనూరుకు 33 బెర్తులు అందుబాటులో ఉంటాయి. అలానే కొట్టాయంకు 31, కోయంబత్తూరుకు 14, సేలంకు 6, తిరుపతికి 9 ఉంటాయి. గుంటూరు నుంచి చెంగనూరుకు త్రీటైర్ 2, కొట్టాయంకు 7, కోయంబత్తూరుకు 7, సేలంకు 3, తిరుపతికి 2 బెర్తులు ఉంటాయి. దీని దృష్ట్యా తిరుపతి/సేలం/కోయంబత్తూరులలో ఏదో ఒక స్టేషన్‌కు ఫస్ట్ టికెట్, అక్కడి నుంచి చెంగనూరుకు రెండో టికెట్ బుకింగ్‌కు ప్రయత్నిస్తే కన్‌ఫర్మ్డ్ బెర్తులకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శశిధర్‌చౌదరి సూచించారు.