Share News

AP High Court: ఎస్‌ఐ నియామకాలపై స్టే ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరణ

ABN , First Publish Date - 2023-11-24T16:08:54+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చిన ఉన్నత న్యాయస్థానం.. హైకోర్టు నియమించే బృందం సమక్షంలో అభ్యర్థులకు తిరిగి ఎత్తు కొలుస్తామని న్యాయమూర్తి తెలిపారు.

AP High Court: ఎస్‌ఐ నియామకాలపై స్టే ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరణ

అమరావతి: రాష్ట్రంలో ఎస్‌ఐ నియామక ప్రక్రియపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేసేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఎస్సై అభ్యర్థులకు ఎత్తు అంశంలో అన్యాయం జరగలేదని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. 35 వేల మంది యువత భవిష్యత్ దృష్ట్యా స్టే ఎత్తివేయాలని కోరారు. ఈ మేరకు ఎత్తు కొలతలు తీసిన విధానాన్ని వీడియో వేసి చూపించారు.

తప్పని తేలితే జరిమానా..

రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చిన ఉన్నత న్యాయస్థానం.. హైకోర్టు నియమించే బృందం సమక్షంలో అభ్యర్థులకు తిరిగి ఎత్తు కొలుస్తామని న్యాయమూర్తి తెలిపారు. అభ్యర్థులు తప్పుడు ఆరోపణలు చేసినట్టు నిరూపితమైతే ఒక్కో అభ్యర్థికి రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈ నెల 29న ఎంతమంది హాజరవుతారో తెలపాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది జడ శ్రవణ్‌ కుమార్‌కు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది.

Updated Date - 2023-11-24T16:54:58+05:30 IST