AP NEWS: వాణిజ్య పన్నుల శాఖపై కేఆర్ సూర్యనారాయణ సంచలన ఆరోపణలు

ABN , First Publish Date - 2023-04-21T17:26:12+05:30 IST

ప్రభుత్వం, వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులపై వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ (KR Suryanarayana) సంచలన ఆరోపణలు చేశారు.

AP NEWS: వాణిజ్య పన్నుల శాఖపై కేఆర్ సూర్యనారాయణ సంచలన ఆరోపణలు
AP NEWS

అమరావతి: ప్రభుత్వం, వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులపై వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ (KR Suryanarayana) సంచలన ఆరోపణలు చేశారు. అవినీతి అధికారులను ప్రభుత్వం వెనకేసుకొస్తున్నట్టుగా కనిపిస్తోందని ఆరోపించారు. ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్న ఎస్సీ ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. సంబంధిత ఉన్నతాధికారులపై అట్రాసిటి కేసు పెడతామని కేఆర్ హెచ్చరించారు. బాధలు చెప్పుకుందామంటే మంత్రి బుగ్గన (Buggana Rajendranath) అందుబాటులో లేరంటూ సూర్యనారాయణ నిర్వేదం వ్యక్తం చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో నిబంధనలకు విరుద్దంగా జరుగుతున్న నియామకాలపై కేంద్రానికి కూడా ఫిర్యాదు చేస్తామంటూ కేఆర్ వార్నింగ్ ఇచ్చారు.

‘‘వాణిజ్య పన్నుల శాఖ విశాఖ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు బడ్జెట్ ఇవ్వలేదు. బడ్జెట్ లేకున్నా కార్పోరేట్ ఆఫీస్ హంగులతో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. బడ్జెట్ కేటాయింపులు లేకుండా ఏర్పాటు చేసిన ఆ కార్యాలయం ప్రారంభోత్సవానికి మంత్రి బుగ్గన, ఉన్నతాధికారులు వెళ్లారు. కార్యాలయం ఏర్పాటుకు వసూళ్లు చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారి సుధాకర్ సహా ఐదుగురుపై ఆరోపణలు వచ్చాయి. కానీ కింది స్థాయిలో ఉన్న నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఏ-1గా ఉన్న విశాఖ వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ సుధాకర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? దొంగతనం చేసిన అధికారులను వదిలి ఉద్యోగులపై అకారణంగా చర్యలు తీసుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు తప్పు చేసిన వాళ్లను వెనకేసుకొస్తున్నారు.మంత్రి బుగ్గనకు చెబుదామంటే అందుబాటులో ఉండడం లేదు.’’ అని కేఆర్ సూర్యనారాయణ చెప్పుకొచ్చారు.

‘‘మంత్రి బుగ్గన కార్యాలయంలో కూడా బాధ్యాయుతమైన వ్యక్తులు లేరు. వాణిజ్య పన్నుల శాఖ జోన్-1 పరిధిలోని బదిలీల్లో అవకతవకలు జరిగాయి. సీఎస్‌కు లేఖ రాసినందుకే సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వరీని సస్పెండ్ చేశారు. ఎస్సీ వర్గానికి చెందిన సీనియర్ అసిస్టెంటును సస్పెండ్ చేయడం ఎస్సీ అట్రాసిటీ పరిధిలోకి వస్తుంది. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ నాగార్జునపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతాం. గ్రూప్-1 అధికారి డి. రమేష్‌ను వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా నియమించారు. డి. రమేష్‌ను కమిషనర్ పోస్టు నుంచి తప్పించాలి. లేకుంటే డీఓపీటీకి ఫిర్యాదు చేస్తాం. ఆకాశరామన్న ఉత్తరాలతో క్రమశిక్షణా చర్యలు తీసేసుకుంటున్నారు. ప్రభుత్వానికి.. మాకు వచ్చిన గ్యాప్‌ను ఆసరా చేసుకుని కొందరు అధికారులు వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘాన్ని టార్గెట్ చేశారు. ఆదాయాన్ని పెంచేలా వాణిజ్య పన్నుల శాఖను పునర్ వ్యవస్థీకరించాలని సీఎం జగన్ సూచించారు. సీఎం జగన్ (CM JAGAN) శాఖను పునర్ వ్యవస్థీకరించమంటే.. అధికారులు పునర్ విభజన చేస్తున్నారు. వికేంద్రీకరణ చేయమంటే.. కేంద్రీకృతం చేస్తున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్దంగా బదిలీలు జరిగాయి. కాండక్ట్ రూల్స్ ప్రకారం ఉద్యోగుల ధర్నాలు చేయకూడదనేం లేదు. ప్రవర్తనా నియామవళికి లోబడే మేం ధర్నా చేపట్టాం. బదిలీల్లోని అక్రమాలపై చర్యలు తీసుకోమంటే.. మా సంఘంపై చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసిన అధికారులకు సన్మానం చేయాలా..? మేం ఎవరి విధులకు ఆటంకం కలిగించలేదు.’’ అని కేఆర్ సూర్యనారాయణ వివరించారు.

Updated Date - 2023-04-21T17:26:12+05:30 IST