Inner Ring Road : ఇన్నర్‌పై కట్టుకథలు.. అసలు వాస్తవాలు ఇవీ...

ABN , First Publish Date - 2023-09-28T03:27:36+05:30 IST

అమరావతిలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వేయాలని నిర్ణయించారే తప్ప రోడ్డు వేయలేదని, భూసేకరణ జరగలేదని, పైసా నిధులు కూడా ఇవ్వలేదని,

Inner Ring Road : ఇన్నర్‌పై కట్టుకథలు.. అసలు వాస్తవాలు ఇవీ...

అమరావతిలో రింగ్‌ రోడ్డే వేయలేదు

భూసేకరణా లేదు.. నిధులూ ఇవ్వలేదు

మరి అవినీతి ఎలా జరుగుతుంది?

ఏదో ఊహించి కేసులు పెడతారా?

ఇలాంటి కేసు దేశంలో ఇదే ప్రథమం

చిల్లింగ్‌ ప్లాంట్‌ కోసం దారి మార్చి అధికార దుర్వినియోగం చేశారంటే నవ్వుతారు

నారాయణకు ఎలాంటి లబ్ధీ జరగలేదు

ఆయన భూమే రోడ్డు కింద పోతుందని సీఆర్‌డీఏ చెప్పింది

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుపై టీడీపీ ప్రజెంటేషన్‌

అమరావతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వేయాలని నిర్ణయించారే తప్ప రోడ్డు వేయలేదని, భూసేకరణ జరగలేదని, పైసా నిధులు కూడా ఇవ్వలేదని, అలాంటప్పుడు అధికార దుర్వినియోగం, అవినీతి ఎలా జరుగుతుందని టీడీపీ ప్రశ్నించింది. రోడ్డు నిర్మాణం జరిగితే దాని వల్ల ఎవరైనా లబ్ధి పొందారేమోనని అనుకోవచ్చని, ఏదీ జరగకున్నా ఎవరికో లబ్ధి జరిగిందని ఊహించి కేసులు పెడతారా? అని మండిపడింది. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నమూనా అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. వేయని రోడ్డు వల్ల అవినీతి జరిగిందని కేసులు పెట్టడం దేశంలో ఇదే ప్రఽథమమని, వైసీపీ ప్రభుత్వం ఎంత ఘోరంగా కేసులు పెడుతోందో ఇదే నిదర్శనమని విమర్శించారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంపై వైసీపీ ఆరోపణలకు సమాధానం చెప్పారు. ప్రజెంటేషన్‌లోని వివరాలు..

హెరిటేజ్‌పై ఆరోపణలు హాస్యాస్పదం

హెరిటేజ్‌ సంస్థ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ కాదు. రాజధాని ప్రాంతంలోపాల చిల్లింగ్‌ ప్లాంట్‌ పెట్టడానికి భూములు కొనుక్కొంది. రోడ్డు పక్కన ఉన్నా, లోపల ఉన్నా చిల్లింగ్‌ ప్లాంట్‌ మారదు. దాని కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి పదవిని దుర్వినియోగం చేసి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును తీసుకువచ్చి హెరిటేజ్‌ భూముల పక్కన పెట్టారంటే నవ్విపోతారు. పైగా హెరిటేజ్‌ సంస్థ చంద్రబాబు ఒక్కరిది కాదు. పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా ఉన్న ఆ సంస్థకు ఏదైనా లాభం కలిగితే అందులో వాటాదారులుగా ఉన్న లక్షల మందికి లాభం కలుగుతుంది. దాని కోసం చంద్రబాబు రింగ్‌ రోడ్డును తెచ్చి దాని పక్కన పెట్టారంటే అంతకంటే హాస్యాస్పదం ఉంటుందా?

నారాయణకు లబ్ధి జరగలేదు

అమరావతిలోని 27 రహదారులను కలపడానికి ఒక ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వేయాలన్న నిర్ణయం మినహా రోడ్డే వేయలేదు. అప్పటి పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆస్తులకు ఈ రోడ్డు వల్ల విలువ పెరిగిందని ఆరోపణ చేశారు. ఆయనకు విజయవాడ శివారులోని పోరంకిలో భూమి ఉంది. అందులో భవన నిర్మాణానికి ఆయన దరఖాస్తు పెట్టుకొన్నారు. రోడ్డు వేస్తే ఆ భూమి అందులో పోతుందని, అందువల్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వలేమని సీఆర్‌డీఏ దరఖాస్తును తిరస్కరించింది. సమాచార హక్కు చట్టం కింద దీనిని అధికారికంగా చెప్పారు. ఇక నారాయణ ఆస్తులకు విలువ పెరిగింది ఎక్కడ? ఆయన భూమి పోతుంటే అధికార దుర్వినియోగం ఎక్కడ జరిగినట్లు?

లింగమనేనికి ఏం మేలు జరిగింది?

లింగమనేని రమేశ్‌ అనే వ్యక్తికి చెందిన భవనంలో చంద్రబాబు అద్దెకు ఉన్నారు. అధికారికంగా ఆయనకు అద్దె చెల్లించారు. రమేశ్‌కు భూములకు దగ్గరగా వెళ్లేలా రోడ్డు మార్గాన్ని మార్చారని మరో ఆరోపణ చేశారు. రమేశ్‌ కుటుంబానికి రాజధాని ప్రాంతంలో అనేక దశాబ్దాల క్రితం నుంచి 355 ఎకరాల భూములు ఉన్నాయి. రోడ్డు ఎటు నుంచి వేసినా ఎక్కడో ఒక చోట ఆయన భూములకు దగ్గరగా వస్తుంది. మరో చోట ఆయన భూములు పోతాయి. రోడ్డు మార్గం వల్ల తన భూములు 14 ఎకరాలు పోతాయని ఆయన హైకోర్టుకు నివేదించారు. మరి ఆయనకు ఏం మేలు జరిగింది?


అప్పుడు టీడీపీ ప్రభుత్వమే లేదు

రామకృష్ణ హౌసింగ్‌ అనే సంస్థ భూముల పక్క నుంచి రోడ్డు వెళ్లేలా మంత్రి నారాయణ అధికార దుర్వినియోగం చేశారని ప్రభుత్వం మరో ఆరోపణ చేసింది. తమ భూములకు ఐదున్నర కిలోమీటర్ల దూరం నుంచి రోడ్డు వెళ్తోందని ఈ హౌసింగ్‌ సంస్థ హైకోర్టుకు గతంలోనే తెలిపింది. ఈ సంస్థకు నిషేధిత జాబితాలో ఉన్న భూములను విముక్తం చేశారని, నిర్మాణ అనుమతులు ఇచ్చారని మరో ఆరోపణ చేశారు. 2013లోనే ఈ సంస్థకు అన్ని రకాల నిర్మాణ అనుమతులు వచ్చాయి.

అధికారులే ఎంపిక చేశారు

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వ్యవహారంలో గత ప్రభుత్వంలోని రాజకీయ నేతలపై మాత్రమే సీఐడీ కేసులు పెట్టింది. అయితే అధికారులు ఎవరూ తప్పులు చేయలేదా? ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఎటు నుంచి వేయాలన్న దానిపై సంబంధిత కన్సల్టెన్సీ సంస్థ మూడు ప్రత్యామ్నాయాలు ఇచ్చింది. దీనిపై పరిశీలన జరిపి నిర్ణయం తీసుకోవడానికి కొందరు అధికారులతో కమిటీ వేశారు. దీనికి అప్పటి సీఆర్‌డీఏ కమిషనర్‌ నాగులపల్లి శ్రీకాంత్‌ కన్వీనర్‌. ఈ కమిటీలో ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ లేరు. ఈ మూడు ప్రత్యామ్నాయాల్లో ఒకదానిని అధికారులు ఎంపిక చేశారు. దానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఒకదానిని ఎంపిక చేయడంలో పక్షపాతం చూపించారని కేసు పెట్టారు. ఎంపిక చేసిన అధికారులు ఎవరిపైనా కేసులు లేవు. వారెవరూ ఈ ఎంపికను వ్యతిరేకిస్తూ ఫైళ్లలో భిన్నాభిప్రాయం రాయలేదు.

సీఆర్‌డీఏ కమిషనర్‌పై కేసు ఎందుకు పెట్టలేదు?

మాస్టర్‌ ప్లాన్‌ తయారీకి సింగపూర్‌కు చెందిన సుర్బానా జురాంగ్‌ సంస్థకు నామినేషన్‌పై పని అప్పగించారని, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ మార్గదర్శక సూత్రాలకు ఇది వ్యతిరేకమన్న సీఐడీ వాదన అర్థరహితం. అంతర్జాతీయ స్థాయిలో ఒక నగరాన్ని నిర్మించేటప్పుడు ప్రణాళిక తయారు చేసేవారికి అనుభవం తప్పనిసరి. రెండుసార్లు టెండర్లు పిలిస్తే వచ్చిన కంపెనీలకు అర్హతలు చాల్లేదు. సింగపూర్‌ ప్రభుత్వ సిఫార్సుతో ప్రణాళిక తయారీలో అనుభవం ఉన్న ఆ దేశ కంపెనీకి పని ఇచ్చారు. ఈ పని కోసం ఆ కంపెనీకి కేవలం 14 కోట్లు ఇచ్చింది. వారు చేసిన పనితో పోలిస్తే ఈ చెల్లింపు చాలా చిన్న మొత్తం. ఇలా ఇవ్వడం సీవీసీ మార్గదర్శక సూత్రాలకు వ్యతిరేకం అనుకుంటే ఆదేశాలు ఇచ్చిన సీఆర్‌డీఏ కమిషనర్‌పై కూడా కేసు పెట్టాలి. ఎందుకు పెట్టలేదు?

నిరాధార ఆరోపణలతో రాజధానిని చంపేశారు

నిరాధార ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వం రాజధానిని చంపేసిందని రాజధాని ప్రాంత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యానించారు. ‘‘రాజధాని నిర్మాణానికి నిధులు లేవనే టీడీపీ ప్రభుత్వం దీనిని సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ ప్రాజెక్టుగా చేపట్టింది. భవనాలు పోను ప్రభుత్వం వద్ద ఐదు వేల ఎకరాలు మిగులుతాయి. అభివృద్ధి చేసిన తర్వాత విక్రయిస్తే వీటి ద్వారా రూ.లక్ష కోట్లు వచ్చేవి. దీనితో రాజధాని పూర్తయ్యేది. రాజధాని పూర్తయితే 20 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు వచ్చేవి. హైదరాబాద్‌లో రూ.2 వేల కోట్లతో సైబరాబాద్‌ నిర్మిస్తే 13 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. అమరావతిలో ముందు అనుకొన్న 20 ప్రాజెక్టులు వచ్చినా రెండున్నర లక్షల ఉద్యోగాలు వచ్చేవి. చంద్రబాబుపై రాజకీయ ద్వేషంతో రాజధానిని చంపేసి యువతకు నష్టం చేశారు’ అని ఆమె అన్నారు.

Updated Date - 2023-09-28T06:48:31+05:30 IST