Pattabhiram: ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ కుట్రలో ప్రధాన దోషి జగన్
ABN , First Publish Date - 2023-10-04T16:30:58+05:30 IST
అమరావతి: ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ నాశనానికి పన్నిన కుట్రలో ప్రధాన దోషి సీఎం జగన్ అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.
అమరావతి: ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ (AP Fiber Net Project) నాశనానికి పన్నిన కుట్రలో ప్రధాన దోషి సీఎం జగన్ (CM Jagan) అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) అన్నారు. ఈ సందర్భంగా బుధవారం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో (TDP Office) ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి అర్హతలు లేని గౌరీశంకర్‌ను ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించి, అతని ద్వారా ముఖ్యమంత్రి తన కుట్రలు అమలు చేశారని ఆరోపించారు. సీఎం హోదాలో తానే స్వయంగా సంతకం పెట్టి గౌరీశంకర్‌కు ఏపీ ఫైబర్ నెట్‌లో కీలక పదవి కట్టబెట్టారన్నారు. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవినీతి జరిగినట్టు నిరూపించడం కోసం.. ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి పరిధి దాటి కుట్రలు అమలు చేశారన్నారు. ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై బురద జల్లడం కోసం.. లేని అవినీతిని సృష్టించి, దానిలో చంద్రబాబును ఇరికించడం కోసం 524 కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను కట్ చేయించిన జగన్ రెడ్డి.. దానికి కొనసాగింపుగా తన కుట్రల్ని అమలు చేయడం కోసం అనర్హుడైన గౌరీశంకర్‌ను ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారన్నారు. అతని ద్వారా అనుకున్నకుట్రల్ని అమలు చేసి.. చంద్రబాబు, లోకేష్‌లపై బురదజల్లుతున్నారని ఆరోపించారు.
కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయని గౌరీ శంకర్ కోసం తాడేపల్లి ప్యాలెస్‌లో దొంగ సర్టిఫికెట్లు సృష్టించి మరీ జగన్ రెడ్డి అతన్ని ఈడీగా నియమించారని పట్టాభిరామ్ ఆరోపించారు. అతని అర్హతలపై అభ్యంతరాలు రావడంతో తాము అనుకున్న పని పూర్తయ్యాక జగన్ సర్కార్ అతన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ నుంచి తొలగించి చేతులు దులుపుకుందన్నారు. దొంగ సర్టిఫికెట్లతో ప్రభుత్వ సంస్థను మోసగించిన వ్యక్తిపై ఈ రాష్ట్రంలో చర్యలుండవా?... కేసులు నమోదు చేయరా? అని ప్రశ్నించారు.
గౌరీ శంకర్ నియామకంలో కుట్రపూరితంగా వ్యవహరించిన ముఖ్యమంత్రిని విచారించే ధైర్యం సీఐడీకి ఉందా?.. అతను ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టుకు పనికిరాడని తెలిసి జగన్ రెడ్డి ఏరికోరి అతన్ని ఎందుకు నియమించారని పట్టాభిరామ్ నిలదీశారు. అతని ద్వారా తాను అనుకున్నది చేసి, ఏదో విధంగా చంద్రబాబుని అక్రమంగా ఫైబర్ కేసులో ఇరికించాలనే దురాలోచనతోనే ముఖ్యమంత్రి హోదాలో తానే స్వయంగా సంతకం పెట్టి అతన్ని ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని చేశారని ఆరోపించారు. గౌరీశంకర్ నియామకం సహా.. అతని ఎంపికలో ముఖ్యమంత్రి పాత్ర, ప్రమేయాలకు సంబంధించిన వివరాలు సీఐడీకి అందిస్తామని.. తాడేపల్లి ప్యాలెస్ తలుపు తట్టే ధైర్యం సీఐడీ చీఫ్ సంజయ్‌కు ఉందా? అని పట్టాభిరామ్ ప్రశ్నించారు.