Amaravati: ఖనిజాభివృద్ది సంస్థ కార్యాలయం వద్ద టీడీపీ నిరసన
ABN , First Publish Date - 2023-08-30T13:59:17+05:30 IST
అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలు తాడిగడపలోని ఖనిజాభివృద్ది సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆఫీసు వద్ద నిరసనకు దిగారు. ఇబ్రహీంపట్నం వద్ద భారీగా పోలీసులు మోహరించటంతో టీడీపీ నేతలు వ్యూహం మార్చుకుని తాడిగడప ఖనిజాభివృద్ది సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలు (TDP Leaders) తాడిగడపలోని ఖనిజాభివృద్ది సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆఫీసు వద్ద నిరసనకు దిగారు. ఇబ్రహీంపట్నం వద్ద భారీగా పోలీసులు మోహరించటంతో టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు (Nakka Anandababu), జీవీ ఆంజనేయులు (GV Anjaneyulu), ఎమ్మెల్సీ అశోక్ బాబు (Ashokbabu), తెనాలి శ్రావణ్ కుమార్ (Tenali Shravan Kumar), కొమ్మాలపాటి శ్రీధర్ (Kommalapati Sridhar) తదితరులు వ్యూహం మార్చుకుని తాడిగడప ఖనిజాభివృద్ది సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇసుక అక్రమ క్వారీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇసుక పాలసీ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) రూ. 40 వేల కోట్లు దిగమింగారని టీడీపీ నేతలు ఆరోపించారు. జేపీ పవర్ వెంచర్స్ సంస్థను తెరముందుకు తెచ్చి తెర వెనుక తన అనుయాయులతో ఇసుక మొత్తాన్ని జగన్ హస్తగతం చేసుకున్నారని ధ్వజమెత్తారు. సీఎం తన అనుచరులతోనే దగ్గరుండి ఇసుక మాఫియాను నడిపిస్తూ.. తన ఖజానా నింపుకుంటున్నారని మండిపడ్డారు. హోల్ సేల్ దోపిడీ చేస్తూ భవన కార్మికుల పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేపీ సంస్థకు ఇచ్చిన టెండర్ గడువు ముగిసిన తర్వాత కూడా అదే కంపెనీ బిల్లులతో ఇసుక అమ్మకాలు సాగిస్తున్నారని, ఇది ముమ్మాటికీ కుంభకోణమేనని టీడీపీ నేతలు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని ఎన్‌జీటీ (NGT), సుప్రీంకోర్టు ఆదేశించినా పట్టించుకోకుండా ఎలా తవ్వకాలు చేస్తున్నారని టీడీపీ నేతలు నిలదీశారు.