Varla Ramaiah: ఎంపీ కుటుంబం కిడ్నాప్ కేసు ఇంకా పూర్తికాలేదు...
ABN , First Publish Date - 2023-06-26T16:43:18+05:30 IST
అమరావతి: విశాఖపట్నం ఎంపీ కుటుంబం కిడ్నాప్ కేసు ఇంకా పూర్తికాలేదని.. ఇంకా ఉందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.
అమరావతి: విశాఖపట్నం ఎంపీ కుటుంబం కిడ్నాప్ కేసు ఇంకా పూర్తికాలేదని.. ఇంకా ఉందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. సోమవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ విశాఖపట్నం ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ఈ కుట్ర బయటకు రావాలంటే సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. 13వ తేదీన కిడ్నాప్ అయితే.. 15వ తేదీ వరకు పోలీసులకు తెలియలేదంటే.. ఎంపీ ఈ కిడ్నాప్ విషయం పోలీసులకు చెప్పలేదంటే దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నట్లేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై ఇంత వరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
సిట్టింగ్ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ జరిగితే లోక్‌సభ సెక్రటేరియట్ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేలేదని వర్ల రామయ్య ప్రశ్నించారు. పట్టపగలు ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేస్తే, రాష్ట్ర గవర్నర్ స్పందన రాష్ట్ర ప్రజలకు తెలియకపోవడంలో అర్థం ఏమిటన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తన పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయితే ఎందుకు స్పందించలేదు?.. ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. కిడ్నాప్ అయిన వారిలో ఒకరైన ఆడిటర్ జీ.వీ రాష్ట్ర ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడన్నతి నిజమేనా?.. కిడ్నాప్ అయిన తర్వాత ఎంపీ సత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘నేను ఈ రాష్ట్రంలో ఉండను నా వ్యాపారమంతా తెలంగాణా రాష్ట్రానికి మార్చుకుంటానని చెప్పడం రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ప్రభుత్వ ముఖాన చెప్పినట్లు కాదా?.. తర్వాత ఎంపీని సీఎంవో అధికారులు బెదిరించి నేను రాష్ట్రంలోనే ఉంటాను తెలంగాణ వెళ్లనని అతని అభీష్టానికి వ్యతిరేకంగా చెప్పించినది నిజం కాదా?’’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు.
తన కుటుంబ సభ్యుల కిడ్నాప్ బాధలో ఉన్న ఎంపీ.. ఎవరి బెదిరింపుల వలన ఈ నెల 17న రూ. కోటీ యాభై లక్షలతో 2 పేజీల ప్రతికా ప్రకటనలు‘‘సాక్షి’’ పత్రికకు ఇచ్చారని వర్ల రామయ్య అన్నారు. ఆ సాక్షి పత్రికకు ఇచ్చిన ప్రకటన నుంచే సీబీఐ దర్యాప్తు చేస్తే ఈ కేసులోని అసలు నిందితులు, పెద్ద తలలు బయటకు వస్తాయన్నారు. విశాఖలో భూ కబ్జా సింహాల మధ్య జరుగుతున్న లావాదేవీలే ఈ కిడ్నాప్‌కు ప్రధానాంశమని అనుకుంటున్న నేపథ్యంలో ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయాల్సిందేనన్నారు. ఈ కేసులో రాష్ట్ర పోలీసుల దర్యాప్తు సరిగా లేనందున, ముఖ్యమంత్రి వెంటనే ఈ కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.