Palnadu Dist.. పార్టీ కోసం నాకున్న 70 ఎకరాలకు పైగా అమ్మాను: వైసీపీ నేత
ABN , First Publish Date - 2023-01-02T12:02:07+05:30 IST
పల్నాడు జిల్లా: పెదకూరపాడు నియోజకవర్గం వైసీపీ (YCP)లో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే నంబూరు శంకరరావుపై బెల్లంకొండ జడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి అసమ్మతి గళం వినిపించారు.
పల్నాడు జిల్లా: పెదకూరపాడు నియోజకవర్గం వైసీపీ (YCP)లో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు (Namburu Shankara Rao)పై బెల్లంకొండ జడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి (Gade Venkata Reddy) అసమ్మతి గళం వినిపించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అంటే పిచ్చి అభిమానంతో పార్టీలో చేరామని, ‘యాత్ర (Yatra)’ సినిమా ప్రదర్శన కోసం బంగారం (Gold) తాకట్టు పెట్టి మరీ సినిమా హాలు అద్దెకు తీసుకొని ప్రదర్శించామని చెప్పారు. వైసీపీ అధికారంలోకి రావడానికి ఎన్నికల సమయంలో రూ. కోటికి పైగా ఖర్చు పెట్టానన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చాక బెల్లంకొండ మండలం జడ్పీటీసీగా గెలిచానన్నారు. పార్టీ కోసం తనకున్న 70 ఎకరాలకు పైగా అమ్మానన్నారు. ఈ నాలుగేళ్ళల్లో తన సొంత సమస్యలే పరిష్కారం చేసుకోలేకపోయానన్నారు. తనను నమ్మి గెలిపించిన ప్రజల సమస్యలను ఎలా తీర్చాలన్నారు. అధికారులకు ఎన్ని సార్లు చెబుతున్నా పట్టించుకోవడంలేదని, సమస్యలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ప్రోత్సహిస్తున్నారని గాదె వెంకటరెడ్డి అన్నారు.