AP News: చెరువు అక్రమ తవ్వకం.. గురజాడ గ్రామస్థుల తిరుగుబాటు
ABN , First Publish Date - 2023-06-16T15:42:38+05:30 IST
గ్రామంలో చెరువు అక్రమ తవ్వకంపై పమిడిముక్కల మండలం గురజాడ గ్రామస్థులు తిరుగుబాటుకు దిగారు. జిల్లా కలెక్టర్‌కు ఈ అక్రమ మట్టి తవ్వకాలను తెలియజేస్తూ గ్రామస్థులు లేఖ రాశారు.
కృష్ణా: గ్రామంలో చెరువు అక్రమ తవ్వకంపై పమిడిముక్కల మండలం గురజాడ గ్రామస్థులు తిరుగుబాటుకు దిగారు. జిల్లా కలెక్టర్‌కు ఈ అక్రమ మట్టి తవ్వకాలను తెలియజేస్తూ గ్రామస్థులు లేఖ రాశారు. పమిడిముక్కల మండలం గురజాడ గ్రామంలో వీరయ్య చెరువులో మట్టి తవ్వకం పనులను గాను జంపన పవన్ కుమార్‌కు టెండర్ ఖరారైంది. టెండర్ ఖరారులో పారదర్శకత లోపించిందని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ గ్రామ పంచాయితీ మట్టిటెండర్‌ను ఈనెల 13న రహస్యంగా ఓకే చేసింది. టెండర్ ప్రక్రియ కోసం కనీసం దండోరా, మైక్ ద్వారా ప్రచారం చేయకుండా పూర్తిచేశారు. అయితే టెండర్‌లో పాడుకున్న మొత్తాన్ని చెల్లించకుండా అధికారుల వద్ద నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండా చెరువు తవ్వకం పనులు ప్రారంభమయ్యాయి. 14 నుంచే చెరువు తవ్వకం ప్రక్రియను ప్రారంభించారు. టెండర్ నియమాలకు విరుద్ధంగా చెరువు కట్టలు బలపరచకుండా మట్టిని బయటకు అమ్ముతున్నారని లేఖలో గ్రామస్థులు వెల్లడించారు. తవ్వకాన్ని పర్యవేక్షించవలసిన పంచాయతీ కార్యదర్శి కూడా పాటదారులతో కుమ్ముకయ్యాడని ఫిర్యాదు చేశారు. అక్రమంగా చెరువు తవ్వుతున్న వారికి సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆస్తి కాపాడాలని జిల్లా కలెక్టర్‌కు గ్రామస్థులు లేఖ రాశారు.