Heavy Rain: ఏపీకి భారీ వర్ష సూచన
ABN , First Publish Date - 2023-04-29T21:34:11+05:30 IST
ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని నుంచి కర్ణాటక, తెలంగాణ మీదుగా ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) వరకు ద్రోణి విస్తరించింది.
విశాఖపట్నం: ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని నుంచి కర్ణాటక, తెలంగాణ మీదుగా ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) వరకు ద్రోణి విస్తరించింది. ఇంకా ఉత్తరాది మీదుగా వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ పయనిస్తోంది. వీటన్నింటి ప్రభావంతో బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి వీస్తున్నాయి. దీంతో శనివారం కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. అక్కడక్కడా భారీవర్షాలు కురిశాయి. ఆదివారం నుంచి వరుసగా మూడు రోజులపాటు కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయి. ఆదివారం రాయలసీమలో అక్కడక్కడా భారీవర్షాలు (Heavy Rain), సోమవారం రాయలసీమ (Rayalaseema)లో భారీ నుంచి అతిభారీ, కోస్తాలో భారీవర్షాలు, మంగళవారం కోస్తా, రాయలసీమల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ అనిశ్చితి ప్రభావంతో పిడుగులు పడడంతోపాటు గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. మేఘాలు ఆవరించిన వెంటనే ఆరుబయట ఉండేవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.
అనంతలో భారీ వర్షాలు
అనంతపురం జిల్లా (Anantapur district)లోని 25 మండలాల్లో శుక్రవారం రాత్రి భారీ నుంచి మోస్తారు వర్షం (Rain) కురిసింది. 287.8 హెక్టార్లల్లో పలు రకాల పంటలు దెబ్బతిన్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోయారు. గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు మండలాల్లో కోతదశలో ఉన్న 192 హెక్టార్లల్లో వరి పంట నేలమట్టమైంది.
నేలరాలిన మామిడి
అనకాపల్లి జిల్లా కోటవురట్ల, కె.కోటపాడు మండలాల్లో శనివారం గాలి, వాన బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులతో కోటవురట్ల మండలంలో మిరప, నిమ్మ తోటలకు తీవ్రనష్టం వాటిల్లింది. అలాగే మామిడి కాయలు నేలరాలిపోయాయి. సుమారు రెండు గంటల పాటు కురిసిన భారీవర్షానికి గెడ్డలు పొంగి ప్రవహించాయి.