Big Alert: సోమ, మంగళవారం భారీ వర్షం
ABN , First Publish Date - 2023-04-30T22:06:59+05:30 IST
దక్షిణ ఛత్తీస్‌గఢ్ (South Chhattisgarh) పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. ఇంకా విదర్భ నుంచి తెలంగాణ (Telangana), కర్నాటక మీదుగా ఉత్తర తమిళనాడు..
విశాఖపట్నం: దక్షిణ ఛత్తీస్‌గఢ్ (South Chhattisgarh) పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. ఇంకా విదర్భ నుంచి తెలంగాణ (Telangana), కర్నాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి భూ ఉపరితలం దిశగా వీచిన తేమగాలులు, ఉత్తరాది నుంచి వీస్తున్న పొడిగాలుల కలయికతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. దీంతో ఆదివారం కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా మామిడి, మొక్కజొన్న, ఇతర పంటలకు ఈ వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. కాగా సోమ, మంగళవారాల్లో కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల ఉరుములు, పిడుగులతోపాటు గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని, ఇదే సమయంలో వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం రాయలసీమ (Rayalaseema)లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ, కోస్తాలో భారీగా, మంగళవారం కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు (Heavy Rain) కురుస్తాయని తరువాత రెండు రోజులు కూడా వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. కాగా ఈదురు గాలులు, పిడుగులతో వర్షాలు కురుస్తున్నందున ఆరుబయట పనులుచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపర్లు అప్రమత్తంగా ఉండాలని, మేఘాలు ఆవరించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.
8 లేదా 9 తేదీల్లో అల్పపీడనం
ఆగ్నేయ, దానికి ఆనుకుని దక్షిణమధ్య బంగాళాఖాతంలో మే ఎనిమిది లేదా తొమ్మిది తేదీల్లో అల్పపీడనం ఏర్పడనున్నది. ఇది బలపడి మే 12వ తేదీ తరువాత తుఫాన్‌గా మారే అవకాశం ఉందని పలు మోడల్స్ అంచనావేసినట్టు ఇస్రో వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. తుఫాన్‌గా బలపడిన తరువాత పశ్చిమబెంగాల్/బంగ్లాదేశ్ తీరాల దిశగా వెళుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో దక్షిణ, మధ్యభారతంలో ఎండలు పెరుగుతాయి. బహుశా మే 10వ తేదీ తరువాత ఎండలు పెరిగి వడగాడ్పుల తీవ్రత అధికంగా వుంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు.