YCP Vs TDP: మైలవరంలో హైటెన్షన్.. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రజల ఆందోళన
ABN , First Publish Date - 2023-10-18T11:48:21+05:30 IST
మైలవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంగళవారం రాత్రి ఎన్టీఆర్ విగ్రహం ఎదుట వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బ్యానర్ ఏర్పాటు విషయంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు మధ్య రగడ చోటు చేసుకుంది.
ఎన్టీఆర్ జిల్లా: మైలవరంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంగళవారం రాత్రి ఎన్టీఆర్ విగ్రహం ఎదుట వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (YCP MLA Vasantha Krishna Prasad) బ్యానర్ ఏర్పాటు విషయంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు మధ్య రగడ చోటు చేసుకుంది. మైలవరం ఎస్‌వీఎస్ కల్యాణ మండపంలో రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలి కార్యక్రమంలో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌లు పాల్గొననున్నారు. ఎమ్మెల్సీ కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకునే అవకాశం ఉండటంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. మైలవరం పంచాయతీ కూడలిలో భారీగా పోలీసులు మోహరించారు. మైలవరం, తిరువూరు సర్కిల్స్ పరిధి పోలీస్ సిబ్బందితో పాటు వందలాది సీఆర్‌పీతో మైలవరం సీఐ మోహన్ రెడ్డి బందోబస్త్ ఏర్పాటు చేశారు. మైలవరంలో పోలీసుల హడావుడితో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఎటువంటి గొడవలు జరుగుతాయోనని జనం భయపడుతున్న పరిస్థితి. వైసీపీ శ్రేణులకు పోలీసులు మద్దతు తెలపడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహం కనబడకుండా వైసీపీ బ్యానర్ ఏర్పాటు చేయడంపై టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే అండ దండలతో వైసీపీ శ్రేణులు మైలవరంలో అరాచకాలు సృష్టిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.