Ram Gopal Varma: వర్మ ఈ సారి వస్తే గుండు కొట్టిస్తాం..
ABN , First Publish Date - 2023-03-16T17:36:35+05:30 IST
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. నాగార్జున యూనివర్సిటీ ఎదుటు టీఎన్‌ఎస్‌ఎఫ్
గుంటూరు: ‘‘నచ్చింది తిని, తాగి ఎంజాయ్ చేయండని చెప్పారు. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళితే అక్కడ రంభ, ఊర్వశిలు ఉండకపోవచ్చు అని... కాబట్టి బతికున్నప్పుడే జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటూ’’ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ (Ram Gopal Varma) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (Nagarjuna University)లో జరిగిన అకడమిక్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో బుధవారం ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలు, విద్యార్థుల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. గురువారం టీఎన్‌ఎస్‌ఎఫ్, ఏబీవీపీ(TNSF ABVP) నాయకులు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మెయిన్ గేట్ ఎదుట వేర్వేరుగా ఆందోళన చేశారు. ఆర్జీవి ఫోటోని చెప్పుతో కొట్టి, దహనం చేశారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మన్నవ వంశీ మాట్లాడుతూ ఆర్జీవి మరో మారు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అడుగుపెడితే గుండు కొట్టిస్తామని హెచ్చరించారు. వర్మ వ్యాఖ్యలను సమర్ధించి విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య రాజశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఆయన్నీ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ నాయకులు సాయి మాట్లాడుతూ వర్మని వర్సిటీ ఆహ్వానించడమే పెద్ద తప్పని అన్నారు.
అదేవిధంగా గుంటూరులో ఎన్‌ఎస్‌యూఐ (NSUI) ఆధ్వర్యంలో గురువారం వర్మ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్‌వలి మాట్లాడుతూ మహిళలను కించపరచటమే కాక యువతను తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేసిన వర్మను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఏఎన్‌యూ వీసీ వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తప్పుబట్టిన ఉద్యోగులు
వర్సిటీలో వర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. విశ్వవిద్యాలయానికి ఇటువంటి వారిని ఆహ్వానించి, విద్యార్థులకు ఇచ్చే సందేశం ఇదేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలను బాధ్యత కలిగిన వీసీ సమర్థించడాన్ని మహిళా ఉద్యోగులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. సాక్షాత్తు సరస్వతి దేవి కి నిలయమైన విద్యాలయంలో వర్మ వ్యాఖ్యలను విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తప్పు పడుతున్నారు. విద్యాబుద్థులు చెప్పి, విద్యార్థులను సన్మార్గంలో నడవాలని చెప్పాల్సింది పోయి, ఇష్టరాజ్యంగా వర్మ వ్యాఖ్యలు చేయడం సర్వత్ర విమర్శలకు దారి తీసింది. వర్మ వ్యాఖ్యలపై పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు, వర్సిటీ మహిళా ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు.