Share News

AP Politics : ఇది మోసం కాదా జగన్‌?

ABN , First Publish Date - 2023-11-04T03:23:43+05:30 IST

చంద్రబాబు తన హయాంలో ఎన్నికల ముందు మాత్రమే జనాలకు మేలు చేసే ప్రయత్నాలు చేశారంటూ జగన్‌ తరచూ ఆరోపిస్తుంటారు.

AP Politics : ఇది మోసం కాదా జగన్‌?

  • ఎన్నికలకు ఆర్నెల్ల ముందు టెంకాయి కొడితే మోసం..

  • జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు, కులగణన మాత్రం చిత్తశుద్ధా?

  • బడుగులపై నాలుగున్నరేళ్లుగా లాఠీ

  • కులగణన పేరిట కులసంఘాలకు వల వేసే ఎత్తు!

  • ప్రశ్నించే జర్నలిస్టులంతా అసాంఘిక శక్తులేనన్న జగన్‌

  • జర్నలిస్టులు, వారి కుటుంబ ఓట్లపై కన్నేసి.. ఇప్పుడు మస్కా

  • పెన్షన్ల పెంపుపై పదే పదే మడత

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

చంద్రబాబు తన హయాంలో ఎన్నికల ముందు మాత్రమే జనాలకు మేలు చేసే ప్రయత్నాలు చేశారంటూ జగన్‌ తరచూ ఆరోపిస్తుంటారు. పెన్షన్లు గురించి మాట్లాడేటప్పుడూ, ఇదే తరహా వ్యాఖ్యలు చేసేవారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల జరగడానికి ఆర్నెల్ల ముందు మాత్రమే పెన్షన్ల మొత్తాన్ని పెంచిందని, పింఛను మొత్తాన్ని రూ.2,250 చేసింది తామేనంటూ ఆ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. జగన్‌ ఏ ఆరోపణలు ఇన్నాళ్లు చేశారో... అవన్నీ ఆయనకే వర్తించేలా ఉంది శుక్రవారం ప్రకటించిన కేబినెట్‌ అజెండా! రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమాన్ని కాగితాలకే పరిమితం చేసిన జగన్‌ ప్రభుత్వానికి నాలుగున్నరేళ్ల తర్వాత హఠాత్తుగా ఈ వర్గాలు గుర్తుకొచ్చాయి. ఇన్నాళ్లూ కులసంఘాలు గళమెత్తకుండా తీవ్ర అణచివేత ధోరణితో వ్యవహరించారు. ఇప్పుడు ఈ వర్గాలకు ఎరలు వేసే పని మొదలుపెట్టారు. అలాంటి ఒక ఎర కులగణన.

గళమెత్తితే దాడులు.. నిరసన తెలిపితే జైళ్లు!

రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి కులగణన చేపడుతున్నట్లు ఇటీవల బీసీ సంక్షేమశాఖ మంత్రి సచివాలయంలో ప్రకటించారు. శుక్రవారం ఈ అంశం కేబినెట్‌ అజెండాలో చేర్చారు. మొన్నటి వరకు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, సంఘాల నేతలు తమ హక్కుల కోసం, న్యాయంగా దక్కాల్సిన అవకాశాల కోసం ఎన్ని విన్నపాలు చేసుకున్నా సర్కారు పట్టించుకోలేదు. పైగా గళమెత్తితే దాడులు, నిరసనలు తెలిపితే జైళ్లు! అయినా.. వెరవకుండా దళితులు, బీసీలు ఉద్యమిస్తున్నారు. ఎన్నికలొస్తే సత్తా చూపాలన్న కసి కనపరుస్తున్నాయి. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు ఈ సెగ బాగానే తగిలింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో జగన్‌ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను బుజ్జగించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే తెరపైకి తెచ్చిన ‘కులగణన’ అంశం ఎన్నికల స్టంట్‌ మాత్రమేనని పలువురు పెదవి విరుస్తున్నారు.

కేసులు పెట్టాలన్న నోటితోనే...

ముఖ్యమంత్రి జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జర్నలిస్టులను పురుగులకంటే హీనంగా చూస్తున్నారు. పైగా, వారు అసాంఘిక శక్తులుగా మారారని ఇటీవల ఊసడించారు. నిజానికి, టీవీలు, సోషల్‌మీడియా, జర్నలిస్టుల సేవలను విస్తృతంగా వినియోగించుకుని జగన్‌ అధికారంలోకి వచ్చారు.

ఆనక జర్నలిస్టులను పూచికపుల్లలాగా తీసి పడేశారు. సచివాలయంలో కూడా సీఎం పేషీ, మంత్రుల చాంబర్లలో కూడా జర్నలిస్టుల సంచారం అంతంత మాత్రమే. జర్నలిస్టులంటే ఒక రకమైన హేయభావనతోనే మాట్లాడటం జగన్‌ నైజంగా మారిపోయింది. సోషల్‌ మీడియాలో పత్రికా ప్రకటనలు ఇస్తూ జర్నలిస్టులంటే చిన్నచూపు చూడటం పరిపాటిగా మారిపోయింది. జర్నలిస్టుల పట్ల అసెంబ్లీలో కూడా అదే చిన్నచూపు ప్రదర్శిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు అకస్మాతుగా జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలిస్తామంటూ కేబినెట్‌ అజెండాలో చేర్చడం ఎన్నికల ముందు చేస్తున్న చిత్తశుద్ధా? లేక మోసమా? జగనే చెప్పాలని పలువురు పేర్కొంటున్నారు.

పెన్షన్‌ పెంపుపై మూడుసార్లు బురిడీ..

‘‘జూలై 8, 2023... రాజశేఖర్‌రెడ్డి గారి పుట్టిన రోజు. ఆ రోజు పెన్షన్‌ను రూ.3 వేలకు తీసుకుపోతాం అధ్యక్షా... ఎక్కడా కూడా ఇచ్చిన మాటలో పొరపాటు ఉండదు. దానికే కట్టుబడి, నిలబడి ఉండే మనస్తత్వం ఉన్న వ్యక్తులం అఽధ్యక్షా!.. ఎక్కడా అబద్ధాలు ఉండవు, మోసాలు ఉండవు అధ్యక్షా!....‘‘ ఇదీ ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీ సాక్షిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పెన్షన్ల పెంపుదలపై ఇచ్చిన స్పష్టమైన హామీ. వైఎస్‌ పుట్టిన రోజు రావడం.. పోవడం జరిగినా రూ.3 వేల పెన్షన్‌పై ఎక్కడా ప్రకటన రాకపోవడంతో సోషల్‌ మీడియాలో జగన్‌ చేసిన వ్యాఖ్యలు హల్‌చల్‌ చేశాయి. దీనిపై ఇప్పటికి మూడుసార్లు జగన్‌ నాలుక మడతేశారు.

‘‘నాలుగున్నర సంవత్సరాలు ఏమీ చేయకుండా సరిగ్గా ఎన్నికలకు ఆర్నెల్ల ముందు టెంకాయి కొడితే దానిని మోసం అనరా?... అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే టెంకాయి కొడితే దానినే చిత్తశుద్ధి అంటారు’’

- సీఎం జగన్‌ కడపలో స్టీల్‌ప్లాంట్‌

ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలివీ..

నాలుగున్నరేళ్ల తర్వాత..

ఇప్పుడు ఎన్నికలకు ఆర్నెల్ల ముందు కులగణన చేపడతామని కేబినెట్‌ అజెండాలో చేర్చారు. జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటూ కేబినెట్‌ అజెండాలో చేర్చారు.

నాలుగేళ్లపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీలను అన్నీ పథకాలకూ జగన్‌ ప్రభుత్వం దూరం చేసింది. దీంతో వారు తీవ్ర ఆగ్రహంతోఉన్నారు. ఎన్నికలొస్తే సత్తా చూపాలన్న కసితో ఉన్నారు. దీంతో ఎన్నికల ఏడాదిలో వారిపై విసరడానికి జగన్‌ ప్రభుత్వం ‘మాయావలలు’ సిద్ధం చేస్తోంది. అలాంటి ఒక వలే కులగణన!

ప్రభుత్వాన్ని ప్రశ్నించే జర్నలిస్టులు అసాంఘిక శక్తులని, అడవుల్లో ఉండేవారి కంటే వీరే ప్రమాదకర వ్యక్తులంటూ పోలీసు అమరవీరుల దినోత్సవ సభలో జగన్‌ ఊసడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే జర్నలిస్టులపై క్రిమినల్‌ కేసులు పెడతామంటూ ఏకంగా జీవోనే తెచ్చారు. అలాంటిది..ఎన్నికలు దగ్గర పడటంతో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల ఓట్లపై కన్నేసి ఇళ్ల పట్టాలంటూ మస్కా కొట్టే ఎత్తుచేశారు.

దీంతో చంద్రబాబుపై తాను అధికారంలోకి వచ్చిన కొత్తల్లో జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సరిగ్గా ఆయనకే వర్తిస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదేనా జర్నలిస్టులపై చిత్తశుద్ధి?

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాలుగున్నరేళ్లలో ఒక్క ప్రెస్‌మీట్‌ కూడా జగన్‌ నిర్వహించలేదు. సొంత పత్రికవారిని,‘నచ్చిన’ మీడియాను తప్ప ఎవరినీ సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ దరిదాపులకూ రానీయడం లేదు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో పర్మినెంట్‌ పాస్‌ లేదు. ప్రతి సెషన్‌కు అప్పటికప్పుడు తాత్కాలిక పాస్‌లు ఇచ్చి సరిపెడుతున్నారు. జర్నలిస్టులకు గతంలో ఇస్తున్న రాయితీలకు పూర్తిగా మంగళం పలికారు. అక్రెడిటేషన్‌ విషయంలో నాలుగేళ్లు పిల్లిమొగ్గలు వేశారు. పలు జిల్లాల్లో అకారణంగా జర్నలిస్టులపై కేసులు పెట్టారు. ఎమర్జెన్సీలో కూడా ఇంత అణచివేత చూడలేదని సీనియర్‌ పాత్రికేయులు వాపోతున్నారు.

Updated Date - 2023-11-04T08:07:53+05:30 IST