Yuvagalam Padayatra: జగన్ ఓ మోసగాడు: నారా లోకేశ్
ABN , First Publish Date - 2023-04-30T21:49:57+05:30 IST
నాలుగేళ్లుగా స్పందనకు కాల్ చేస్తే స్పందనే లేదు. ఇప్పుడు సీఎం జగన్ (CM Jagan)కు చెబుదాం అనే మరో కొత్త డ్రామా మొదలు పెట్టాడు. నేను చెబుతా ఈ పరదాల జగన్‌కు..
కర్నూలు: ‘‘నాలుగేళ్లుగా స్పందనకు కాల్ చేస్తే స్పందనే లేదు. ఇప్పుడు సీఎం జగన్ (CM Jagan)కు చెబుదాం అనే మరో కొత్త డ్రామా మొదలు పెట్టాడు. నేను చెబుతా ఈ పరదాల జగన్‌కు.. ఎన్నికల ముందు 25 ఎంపీలు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానంటివి.. ఆ హోదా ఏమైంది...? కడప ఉక్కు పరిశ్రమ ఎప్పుడు పూర్తి చేయగలవో చెప్పగలవా..? ఒక్క చాన్స్ ఇస్తే 2.30 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మా నిరుద్యోగల తమ్ముళ్లను మోసం చేశావు.. ఆ ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావో చెప్పగలవా.?’’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రశ్నించారు. యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) ఆదివారం ఎమ్మిగనూరు పట్టణంలో 7 కి.మీ. సాగింది. ఇప్పటి వరకు 1,088.1 కి.మీ. నడిచారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రభుత్వంపై లోకేశ్ నిప్పులు చెరిగారు. ‘‘ఈ జగన్ చేసేవన్ని దొంగ పనులు.. మోసాలే. అందుకే ప్రజల మధ్యకు రావాలంటే భయం. ఎప్పుడో ఒకసారి ప్రజలు మధ్యకు వచ్చినా ఎక్కడ తనను నిలదీస్తారో..? అన్న భయంతో పరదాల చాటున అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాడు. 2019లో ఒక్క చాన్స్ అంటే నమ్మి అధికారం ఇస్తే.. దళితులు, బీసీలు, మైనార్టీలు, మహిళలు, రైతులు, నిరుద్యోగ యువత, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల వాళ్లను మోసం చేశారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో చంద్రబాబు పని చేస్తే.. మీరే చేశారు..? పాలు ఇచ్చే ఆవుకు కాదని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు. తప్పు చేశామని ఇప్పుడు అందరకు బాదపడుతున్నారు. 2024లో ఆ తప్పును సరిదిద్దుకోవాలని’’ అని లోకేశ్ పిలుపునిచ్చారు.