PawanKalyan: 100 ఎపిసోడ్‌లు పూర్తవుతున్న ‘మన్ కీ బాత్’కు నా శుభాభినందనలు
ABN , First Publish Date - 2023-04-29T14:50:40+05:30 IST
ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా నిర్వహిస్తోన్న 'మన్ కీ బాత్' కార్యక్రమం ఈ నెల 30తో 100 ఎపిసోడ్లు పూర్తవుతున్న సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాభినందనలు తెలియజేశారు.
అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) స్వయంగా నిర్వహిస్తోన్న 'మన్ కీ బాత్' (Man ki Bath) కార్యక్రమం ఈ నెల 30తో 100 ఎపిసోడ్లు పూర్తవుతున్న సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan kalyan) శుభాభినందనలు తెలియజేశారు. ఈ మేరకు పవన్ శనివారం పత్రికా ప్రకటనను విడుదల చేశారు. దేశ ప్రధాని దేశవాసులతో రేడియో మాధ్యమం ద్వారా స్వయంగా ముచ్చటించే ఈ కార్యక్రమం.. శ్రోతలకు, తదుపరి టీవీ ప్రసారాల్లో చూసే వీక్షకులకు ఎంతో చేరువైందన్నారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని 100 కోట్ల మంది ప్రజలు ఒక్కసారైన రేడియోలో వినడమో, టీవీలో చూడటమో జరిగిందని తెలిపారు. ప్రతి నెల 23 కోట్ల మంది ఆదరిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. మోదీ ఈ కార్యక్రమంలో ప్రస్తావించే అంశాలు చాలా విభిన్నంగా ఉంటాయన్నారు. సామాన్యులు సాధించే విజయాలు, గొప్ప వ్యక్తులు, కళలు, చేతివృత్తులు, సేవా కార్యక్రమాలు, ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు... ఇలా అనేక అంశాలు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు దగ్గర చేశాయని చెప్పారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రారంభ సందేశంలో “సేవా పరమో ధర్మః” అని మోదీ పేర్కొనడం మనసులను హత్తుకునే విధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కార్యక్రమ నిర్వాహకులకు పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు.