AP News: కాపు జాతిని తాకట్టు పెట్టొద్దు... ముద్రగడకు కాపు సంక్షేమ సేన హెచ్చరిక

ABN , First Publish Date - 2023-06-21T11:57:56+05:30 IST

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై కాపు సంక్షేమ సేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి అమ్ముడుపోయిన ముద్రగడ.. కాపు జాతిని తాకట్టు పెట్టవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు.

AP News: కాపు జాతిని తాకట్టు పెట్టొద్దు...  ముద్రగడకు కాపు సంక్షేమ సేన హెచ్చరిక

విజయవాడ: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై (Mudragada Padmanabham) కాపు సంక్షేమ సేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి (YCP) అమ్ముడుపోయిన ముద్రగడ.. కాపు జాతిని తాకట్టు పెట్టవద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. కాపు సంక్షేమ సేన నేత కృష్ణాంజనేయులు మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభం లేఖ కాపులంతా తల‌దించుకునేలా ఉందన్నారు. ఆయన స్థాయిని ఆయనే ఈ లేఖతో దిగజార్చుకున్నారని తెలిపారు. జనసేనాధిపతిగా ఉన్న పవన్ కళ్యాణ్‌ను (Janasena Chief Pawankalyan) సినీ హీరోగా ప్రస్తావించడం వెనుక కుట్ర అర్ధం అవుతుందని అన్నారు. కాడి పారేసి ఇంట్లో కూర్చున్న ముద్రగడ ఇప్పుడు లేఖ రాయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. కాపు ఉద్యమంలో నష్టపోయున వారిని పరామర్శించారా అంటూ నిలదీశారు. వంగవీటి మోహనరంగా (Vangaveeti Mohan ranga) పేరు జిల్లాకు పెట్టాలని ఎందుకు డిమాండ్ చేయలేదని అడిగారు. పవన్ కళ్యాణ్‌ను, అతని కుటుంబ సభ్యులను బూతులు తిడితే నువ్వెక్కడున్నావని అన్నారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కాపు మహిళలను కొడితే ఎందుకు ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్ ఇవ్వను అన్న జగన్‌కు (AP CM YS Jaganmohan Reddy) ఎలా మద్దతు ఇస్తున్నావంటూ కృష్ణాంజనేయులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

మరోనేత రుద్రనాయుడు మాట్లాడుతూ.. ముద్రగడ లేఖ వెనుక ఆయన రాజకీయ స్వార్ధం ఉందని ఆరోపించారు. 2019 వరకు అనేక ఉద్యమాలు చేసి తరువాత ఎందుకు సైలెంట్ అయ్యారని ప్రశ్నించారు. తుని ఘటనలో అమాయక కాపు యువత జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు. కాపుల ముసుగులో జగన్‌కు, ద్వారంపూడికి అనుకూలంగా పని చేస్తున్నారని ఆరోపించారు. ‘‘నీకు దమ్ముంటే వైసీపీలో చేరి పని‌చేసుకో.‌. కాపు నేత ముసుగులో డ్రామాలు ఆడితే యువత తరిమి కొడతారు’’ అంటూ హెచ్చరించారు. హరిరామ జోగయ్య కాళ్లు కడిగి నెత్తిన జల్లుకో... బుద్ది అయినా వస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.

సుజాత నాయుడు మాట్లాడుతూ.. కాపు ఉద్యమ నేతగా చెప్పుకునే అర్హత ముద్రగడ కోల్పోయారన్నారు. తన స్వార్ధానికి కాపు ఉద్యమాన్ని ఇప్పటికే తాకట్టు పెట్టారన్నారు. ఇప్పుడు ముద్రగడ అమ్ముడుపోయి లేఖ రాశారన్నారు. రంగా పేరు చెప్పుకుని బతికే ముద్రగడ... జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేయలేదే అని నిలదీశారు. ద్వారంపూడి అనే రౌడీ కోసం పవన్ కళ్యాణ్‌ను కించ పరుస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కులం అడ్డం పెట్టుకుని బతకడం కాదు.. వైసీపీ కండువా కప్పుకుని రా... జన సైనికులు నీ సంగతి తేలుస్తారు’’ అంటూ హెచ్చరించారు.

Updated Date - 2023-06-21T12:13:11+05:30 IST