AP Minister: తాడేపల్లి అంధబాలిక హత్యపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-02-14T14:54:52+05:30 IST
తాడేపల్లి అంధబాలిక హత్యోదంతంపై హోంమంత్రి తానేటి వనిత కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: తాడేపల్లి అంధబాలిక హత్యోదంతంపై హోంమంత్రి తానేటి వనిత (AP Home Minister Taneti Vanitha) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... మహిళలకు ఇబ్బందులు కలిగితే ప్రభుత్వం(AP Government)వెంటనే స్పందిస్తోందని తెలిపారు. తాడేపల్లి అంధబాలిక హంతకుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నామన్నారు. అంధ బాలికను గంజాయి మత్తుతో హత్య చేయలేదని... వ్యక్తిగత కక్షతో హత్య చేశారని తెలిపారు. ఇరుగుపొరుగు కావడంతో అంధ బాలిక హత్య జరిగిందని వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు గంజాయి మత్తులో హత్య చేయలేదని.. మద్యం మత్తులో హత్య చేశారని అన్నారు. గంజాయి మీద ఉక్కు పాదం మోపుతున్నా.. ప్రభుత్వం మీద నిందలు వేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఇలాంటి ఘటనలు జరిగితే.. అప్పటి ప్రభుత్వం నిందితుల పక్షానే నిలబడేవారని ఆరోపించారు. తామెందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి చనిపోతే చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) నాడు సీఎం పదవికి రాజీనామా చేశారా అని నిలదీశారు. కందుకూరు, గుంటూరు సంఘటనల్లో 11 మంది చనిపోతే ఎమ్మెల్యే పదవికి చంద్రబాబు రాజీనామా చేశారా అంటూ తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే సీతానగరం అత్యాచరం ఘటనలోని ఇద్దరు నిందితుల్లో ఒకరిని అప్పుడే పట్టుకున్నామని తెలిపారు. రెండో వ్యక్తిని పట్టుకోవడం కొంచెం కష్టంగా మారిందన్నారు. పట్టుబడని రెండో వ్యక్తికి కుటుంబం లేదని... ఎక్కడెక్కడో తిరుగుతున్నాడని అన్నారు. పదే పదే సిమ్ కార్డులు మారుస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి కారణాలతో రెండో నిందితున్ని పట్టుకోవడం కష్టమవుతోందన్నారు. ఇబ్బందులున్నా.. రెండో నిందితున్ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని హోంమంత్రి వనిత పేర్కొన్నారు.
అంధబాలికపై అమానుషం...
కాగా... నిన్న సీఎం నివాసానికి కూత వేటు దూరంలో అమానుష ఘటన జరిగింది. కంటి చూపు లేని ఎస్తేరు రాణి అనే 17 ఏళ్ల యువతిని రాజు అనే వ్యక్తి గంజాయి మత్తులో అతి కిరాతకంగా నరికి చంపాడు.
అసలేం జరిగిందంటే... కంటి చూపులేని రాణి ఇంట్లోనే ఉంటుండగా తల్లి కూలిపనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉంటున్న రాజు... యువతిపై కన్నేశాడు. అప్పుడప్పుడూ యువతి ఇంటికి వచ్చి మాట్లాడుతుండటంతో స్థానికులు ఎవరూ పట్టించుకోలేదు. అయితే యువతి ఇంట్లో ఒంటరిగా ఉండటం... పైగా అంధురాలు కావడంతో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. రాజు వేధింపులు క్రమక్రమంగా పెరగడంతో ఈ విషయాన్ని యువతి తన అమ్మకి, పెద్దమ్మకు తెలిపింది. దీంతో రాజును యువతి తల్లి నిలదీయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాణిపై రాజు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న రాజు అక్కడే ఉన్న గొడ్డలితో రాణిని తలపై అనేకమార్లు కత్తితో నరికాడు. దీంతో యువతి తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే రాణి ప్రాణాలు కోల్పోయింది. ఘటన జరిగిన వెంటనే రాజు అక్కడి నుంచి పరారయ్యాడు. కళ్లు కనిపించని తమ బిడ్డని చంపిన రాజుని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంతమవుతున్నారు. సమాచారం అందిన వెంటే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనా స్థలంలో మారణాయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.